వెయ్యి రోజులు దాటినా.. హామీలు మాత్రం గాలికే…!

సింగరేణి కార్మికులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలేవి?..
వారసత్వ ఉద్యోగాల్లోనూ కోతలే..
పనిచేసే సీఎం కాదు.. కోతల ముఖ్యమంత్రి’ అంటూ గండ్ర ధ్వజం..


భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్‌ 3 (ఆంధ్రప్రభ) : ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. వెయ్యి రోజుల పాలన దాటుతున్నా హామీల అమలుపై నిర్లక్ష్యం చూపుతోందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు.


భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1 ఇంక్లైన్‌ మైన్‌లో టీబీజీకేఎస్‌ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య ఆధ్వర్యంలో గురువారం గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి హాజరై సింగరేణి కార్మికులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించిన ‘బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాల విషయంలో కార్మిక కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెడికల్‌ బోర్డుకు వెళ్లిన వారిలో అర్హులైన వారికి వారసత్వ ఉద్యోగాలు లభించేవని, ప్రస్తుతం బోర్డు ముందుకు వెళ్లిన వారిలో కేవలం పది శాతం మందినే ఇన్వాలిడ్‌గా గుర్తించి, మిగిలిన వారికి కోతలు పెడుతున్నారని ఆరోపించారు. దీంతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న కార్మిక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని పేర్కొన్నారు.

గత మూడేళ్లలో ఎన్ని మెడికల్‌ బోర్డులు నిర్వహించారు? వాటి ద్వారా ఎంతమందికి వారసత్వ ఉద్యోగాలు కల్పించారు? బోర్డుకు హాజరైన వారిలో ఎంతమందిని అనర్హులుగా ప్రకటించారు? అనే వివరాలను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.2,500, పెన్షన్‌ పెంపు, తులం బంగారం వంటి ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హామీలను గుర్తు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని తొలగించడం అంటే ప్రశ్నించే గొంతులను అణచివేయడమేనని మండిపడ్డారు.రాష్ట్ర సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. “ఇది పని చేసే ముఖ్యమంత్రి పాలన కాదు.. ఇచ్చిన హామీల్లో కోతలు, కార్మికుల హక్కుల్లో కోతలు, వారసత్వ ఉద్యోగాల్లో కోతలు పెట్టే ‘కోతల ముఖ్యమంత్రి’ పాలనగా మారింది” అంటూ గండ్ర ధ్వజమెత్తారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్‌ నిరంతరం పోరాడుతుందని ఆ సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి తెలిపారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో అర్హులైన కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.

అనంతరం పలువురు మహిళా కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరగా, వారికి గండ్ర వెంకటరమణారెడ్డి, మిరియాల రాజిరెడ్డి కండువాలు కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ నాయకులు, ఫిట్‌ సెక్రటరీలు, జిల్లా, పట్టణ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.