Eu-Ev-Sales-2026 : చైనా ఈవీలకు షాక్ Andhra Prabha Top News
Eu-Ev-Sales-2026 : చైనా ఈవీలకు షాక్ Andhra Prabha Top News
- ఈయూ కంపెనీలు ,,రయ్ రయ్
- ఐరోపాలో 16.4 లక్షల ఈవీల విక్రయం
- గతేడాదితో పోలిస్తే 45 శాతం వృద్ధి
- యూరప్ కార్ల మార్కెట్లో ఈవీల వాటా 22 శాతం
- పెరుగుతున్న మోడళ్ల సంఖ్య..
( బ్రస్సెల్స్, ఆంధ్రప్రభ ప్రతినిధి)
యూరప్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) జోరు మరింత పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ సంస్థ ట్రాన్స్‌పోర్ట్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (టీ అండ్ ఈ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2026 జనవరి నుంచి ఆగస్టు వరకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాల్లో రికార్డు స్థాయిలో 16.4 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాలు ఏకంగా 45 శాతం పెరిగాయి.
ఈ కాలంలో మొత్తం కార్ల మార్కెట్లో ఈవీల వాటా 22 శాతానికి చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఉన్న 16 శాతంతో పోలిస్తే ఇది ఆరు శాతం పాయింట్ల పెరుగుదల.
మోడళ్ల ఎంపిక భారీ పెరుగుదల కనిపిస్తోంది. 2026ను ఈవీల లభ్యతకు కీలకమైన సంవత్సరంగా టీ అండ్ ఈ అభివర్ణించింది. వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల మోడళ్ల సంఖ్య ఒక్క ఏడాదిలోనే 50 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
ఈయూ నిర్దేశించిన కర్బన ఉద్గారాల లక్ష్యాలను చేరుకోవడానికి కార్ల తయారీ సంస్థలు తమ ఈవీ లైనప్‌ను వేగంగా విస్తరిస్తున్నాయి. ఫలితంగా గతంతో పోలిస్తే వినియోగదారులకు మరిన్ని ధరల శ్రేణుల్లో, మరిన్ని మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి.
అందుబాటు ధరల్లో ఈవీలు
జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్ వంటి దిగ్గజ సంస్థలు కూడా తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఆల్-ఎలక్ట్రిక్ పోలో వంటి మోడళ్లతో ఈ విభాగంలో పోటీని పెంచుతున్నాయి. ఈవీల విక్రయాలను పెంచుకోవడంతో పాటు.. ఈయూ ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తమ వాహన శ్రేణిని మార్చుకోవడం ద్వారా జరిమానాలను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
యూరప్ కంపెనీల ఆధిపత్యం
యూరప్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈవీ మోడళ్లలో దాదాపు 60 శాతం యూరోపియన్ కార్ల తయారీ సంస్థలవే కావడం విశేషం.2026 తొలి ఆరు నెలల్లో యూరోపియన్ కంపెనీలు కొత్తగా 16 ఈవీ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. చైనా కంపెనీలు కూడా వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం ఈవీ మోడళ్ల మార్కెట్లో చైనా తయారీదారుల వాటా 21 శాతంగా ఉంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో వారు మరో 11 కొత్త మోడళ్లను అందుబాటులోకి తెచ్చారు.
పెట్రోల్, డీజిల్ వాహనదారులపై యుద్ధ ప్రభావంమరోవైపు మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు ఇంధన ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాలను వినియోగించే వారికి ఖర్చులు పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా డీజిల్ ధర భారీగా పెరిగింది. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి డీజిల్ ధర 38 శాతం వరకు పెరిగినట్లు టీ అండ్ ఈ తెలిపింది. ప్రస్తుతం 50 లీటర్ల డీజిల్ ట్యాంక్ నింపుకోవడానికి యూరప్‌లో గతంతో పోలిస్తే సుమారు 30 యూరోలు (దాదాపు 34 డాలర్లు) అదనంగా ఖర్చవుతోందని నివేదిక పేర్కొంది.
ఒకవైపు ఇంధన ధరలు పెరుగుతుండటం.. మరోవైపు ఈవీల మోడళ్ల సంఖ్య, లభ్యత, పోటీ ధరలు పెరుగుతుండటంతో యూరప్‌లో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మరింత వేగంగా మళ్లుతున్నారని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
