ESI | విధుల్లో నిర్లక్ష్యం – ఐదుగురు వైద్యులతో సహా తొమ్మిది మంది సస్పెండ్

రాజమండ్రి : నగరంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన సిబ్బందిపై రాష్ట్ర బీమా వైద్య సేవల సంచాలకులు చర్యలు చేపట్టారు.

కొందరు వైద్యులు, సిబ్బంది విధులు నిర్వహించకుండా సంతకాలు చేసి వెళ్లిపోవడాన్ని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ఆకస్మిక తనిఖీ సమయంలో గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు.

దీంతో ఇవాళ ఐదుగురు వైద్యులు, నలుగురు కార్యాలయ సిబ్బందిని సస్పెండ్ చేశారు. మంత్రి సుభాష్‌ సోమవారం ఆసుపత్రిని తనిఖీ చేసిన సమయంలో ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌తోపాటు మరో ముగ్గురు డ్యూటీ డాక్టర్లు విధుల్లో లేరు. వెంటనే ఈఎస్‌ఐ ఆసుపత్రి నుంచే బీమా వైద్య సేవల సంచాలకులు ఆంజనేయులుతో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితిని వివరించారు. ఆసుపత్రి వైద్యులు కొందరు విధులకు డుమ్మాకొట్టి ప్రైవేటు ప్రాక్టీసులు చేసుకుంటున్నారనే ఫిర్యాదులు వస్తుండటంతో మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు.

ఇక్కడి వైద్య సేవల తీరుపై నవంబరులో కార్మిక సంఘాల నాయకులు, ఈఎస్‌ఐ చందాదారులు ఆందోళన చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్‌ఐ బీమా చందాదారులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని, రోగుల సంరక్షణలో ఏదైనా నిర్లక్ష్యం లేదా క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని ఈ సందర్భంగా బీమా వైద్య సేవల డైరెక్టరు ఓ ప్రకటనలో హెచ్చరించారు. రాజమహేంద్రవరం వైద్యులు, సిబ్బందిపై విధి నిర్వహణ విషయంలో విచారణ జరుగుతోందని, సమగ్ర నివేదిక ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *