పరారైన రిమాండ్ ఖైదీ పట్టివేత..!
- ఆదిలాబాద్ రిమ్స్ నుంచి పోలీసుల కళ్లుగప్పి పరారీ
- ఇంద్రవెల్లి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు
- పరారీ కేసు నమోదు చేసి మళ్లీ రిమాండ్‌కు తరలింపు
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి నుంచి పోలీసుల కళ్లుగప్పి పరారైన రిమాండ్ ఖైదీని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిపై పరారీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదిలాబాద్ కుమార్‌పేట్ కాలనీలో 15 రోజుల క్రితం ఓ వృద్ధురాలు రూ.2 వేల పింఛన్ తీసుకుని ఇంటికి వస్తుండగా.. ఇంద్రవెల్లికి చెందిన అనిల్ అనే వ్యక్తి రూ.4 వేల పింఛన్ ఇప్పిస్తానని నమ్మించాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న రూ.2 వేల నగదును తీసుకుని పరారయ్యాడు.
ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి అనిల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జైలులో అస్వస్థతకు గురికావడంతో ఇటీవల చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనిల్ మంగళవారం సాయంత్రం ఎస్కార్ట్ సిబ్బంది కళ్లుగప్పి అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంద్రవెల్లి వైపు నడుచుకుంటూ వెళ్తున్న అనిల్‌ను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. అనంతరం టూటౌన్ పోలీసులు పరారీ కేసు నమోదు చేసి మళ్లీ రిమాండ్‌కు తరలించారు.
