పట్టభద్రుల ఓటు నమోదుపై ఎర్రబెల్లి ప్రత్యేక దృష్టి

ఇంటింటికీ వెళ్లి పట్టభద్రుల వివరాల సేకరణ..
స్వయంగా ఆన్‌లైన్‌లో ఓటు నమోదు
జనగామ, ఆంధ్రప్రభ :
రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు రాష్ట్ర మాజీ మంత్రి, పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో పలువురు పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను స్వయంగా సేకరించారు.


స్థానిక సర్పంచ్ సునీత వీరారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆన్‌లైన్ ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎర్రబెల్లి, నమోదు ప్రక్రియను పరిశీలించారు. పలువురు పట్టభద్రుల ఓటరు నమోదు పూర్తయ్యేలా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించి, అర్హులైన ప్రతి ఒక్కరూ విధిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. అనంతరం రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాన్ని ఓటు ద్వారా తెలియజేయాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టభద్రులు బొమ్మేరా భాషా, గట్టు నవీన్, కోటగిరి కృష్ణమూర్తి, పస్రం శ్రీను, గంధం అశోక్, వడ్లకొండ మమత తదితరులు పాల్గొన్నారు.