అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పాలన
ఆరు గ్యారంటీలు, హామీల అమలులో ప్రభుత్వం విఫలం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తొర్రూరు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వపరంగా విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ హామీల అమలుపై రూపొందించిన భారీ బ్యానర్‌ను ప్రదర్శిస్తూ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ సెంటర్‌లో నిర్వహించిన రాస్తారోకోలో దయాకర్‌రావు మాట్లాడుతూ ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటి అమలులో విఫలమైందని విమర్శించారు.
420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దయాకర్‌రావు ఆరోపించారు. తమను ప్రశ్నిస్తే పోలీసులను పంపించి కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. అన్ని పంటలకు ఇస్తామన్న పంటల బోనస్‌ను ఒక్క పంటకే పరిమితం చేశారని విమర్శించారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదన్నారు.
ప్రభుత్వ చిహ్నాలు, లోగోలు మార్చడంపై పెట్టిన శ్రద్ధ ప్రజల సమస్యల పరిష్కారంపై లేదని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు ప్రకృతి కారణం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు విడుదల చేయడం లేదని, దీంతో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. సాగునీటి కోసం ఆందోళన చేసిన రైతులు, నాయకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారని ఆరోపించారు.
రైతుల సమస్యలపై ఎన్ని కేసులు ఎదురైనా ప్రభుత్వంపై పోరాటాన్ని ఆపేది లేదని దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అప్పులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉందని, ఇప్పటికైనా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టి పెట్టకుండా సంపాదనపై దృష్టి సారించారని విమర్శించారు.
కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేయడం లేదని ఆరోపించారు. రాజకీయ కక్షలకు స్వస్తి పలికి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇటీవల వెలువడిన పలు సర్వేల్లో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని తేలిందని ఆయన అన్నారు. భవిష్యత్తులో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, తాను తిరిగి గెలిచి మంత్రిని అవుతానని దయాకర్‌రావు పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, బీఆర్‌ఎస్ నాయకులు పసుమర్తి సీతారాములు, ఈదురు ఐలయ్య, మునావత్ నరసింహ నాయక్, గాంధీ నాయక్, జినుగా అనిమిరెడ్డి, సోమ నరసింహారెడ్డి, శ్రీరామ్ సుధీర్, నల్లమాస ప్రమోద్, బిందు శ్రీనివాస్, అంకుస్, అనుమాండ్ల ప్రదీప్‌రెడ్డి, కాలు నాయక్, కుర్ర శ్రీనివాస్, వీరారెడ్డి, ధరావత్ జైసింగ్, స్వామి నాయక్, రాయిశెట్టి వెంకన్న, పేర్ల జంపన్న, తూర్పాటి రవి, భవాని లత, ధరావత్ పద్మ, మౌనిక సంతోష్, సురేష్ నాయక్, సంజయ్, బాలు నాయక్, సుధాకర్, సమ్మయ్య, మైలపాక అనిల్, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
