గాయపడిన కానిస్టేబుల్‌కు ఎస్పీ పరామర్శ
వైద్య సేవలపై ఆరా..
ఘటనాస్థలాన్ని పరిశీలించిన వి.విద్యాసాగర్ నాయుడు
కంకిపాడు, ఆంధ్రప్రభ: తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెం వద్ద గంజాయి రవాణాను అడ్డుకునే క్రమంలో పోలీసులపై దాడి చేసి పరారైన నిందితుడిని కంకిపాడు పరిసర ప్రాంతాల్లో గుర్తించి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో గాయపడిన కానిస్టేబుల్ కంకిపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు సంబంధిత పోలీసు అధికారులతో కలిసి ఆసుపత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న కానిస్టేబుల్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
అనంతరం వైద్యులతో మాట్లాడిన ఎస్పీ.. కానిస్టేబుల్‌కు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన వైద్య సేవలు అందుతున్నాయా, మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్య కేంద్రానికి తరలించాల్సిన అవసరం ఉందా అనే అంశాలపై వైద్యులతో చర్చించారు. కానిస్టేబుల్‌కు ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైద్య చికిత్స అందించాలని, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. అవసరమైతే మెరుగైన వైద్య సేవల కోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
గాయపడిన కానిస్టేబుల్‌తో ఎస్పీ మాట్లాడి ధైర్యంగా ఉండాలని, పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో గాయపడిన సిబ్బందికి అవసరమైన వైద్య, సంక్షేమ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఘటన జరిగిన ప్రదేశాన్ని ఎస్పీ స్వయంగా సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. నిందితుడి కదలికలు, పోలీసు సిబ్బంది చేపట్టిన చర్యలు, ఘటన జరిగిన తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు పురోగతిపై కూడా సమీక్షించారు.
