AP | బాల కార్మికుల నిర్మూలన.. నీరుగారుతున్న వ్యవస్థ!

AP | బాల కార్మికుల నిర్మూలన.. నీరుగారుతున్న వ్యవస్థ!

నందికొట్కూరులో బాల కార్మికుల జోరు.. అధికారుల పర్యవేక్షణ ఏదీ?
చదువుకు దూరంగా.. పనుల్లో చిన్నారులు! అధికారుల తనిఖీలు ఎక్కడ?

షాపులు, హోటళ్లు, మెకానిక్‌ షెడ్లు, పండ్ల వ్యాపారాలు, గొర్రెల కాపరులుగా బాలలు..


క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న దృశ్యాలు


AP | నందికొట్కూరు, అక్టోబర్‌ 2 (ఆంధ్రప్రభ): బాల కార్మికుల నిర్మూలన కోసం ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నందికొట్కూరు పట్టణంలో చిన్నారులు చదువుకోవాల్సిన వయసులో వివిధ పనుల్లో కనిపిస్తున్న దృశ్యాలు బాల కార్మికుల నిర్మూలన వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

పట్టణంలోని పలు ప్రాంతాల్లో చిన్నారులు పండ్ల వ్యాపారాలు, కిరాణా దుకాణాలు, హోటళ్లు, మెకానిక్‌ షెడ్లు, ఇతర వ్యాపార సంస్థల్లో పని చేయడంతో పాటు గొర్రెల కాపరులుగా కనిపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా పట్టణ పరిసరాల్లో తీసిన దృశ్యాల్లోనూ చిన్న వయస్కులు ఇలాంటి పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు కనిపిస్తోంది.

అధికారుల నిఘా ఎక్కడ?
బాల కార్మిక వ్యవస్థను అరికట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. పట్టణంలో బాల కార్మికులు కనిపిస్తున్నారనే ఆరోపణలు వస్తుండటంతో అసలు క్షేత్రస్థాయిలో తనిఖీలు జరుగుతున్నాయా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాపార సంస్థలు, హోటళ్లు, వర్క్‌షాప్‌లు తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే వాస్తవ పరిస్థితి బయటపడుతుందని ప్రజలు అంటున్నారు.

కాగితాలకే పరిమితమా?
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వ శాఖలు, అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తున్నా.. పట్టణంలో మాత్రం చిన్నారులు పనుల్లో కనిపించడం ఆ చర్యలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయన్న సందేహాలకు తావిస్తోంది. బాలలను పనుల్లో పెట్టుకుంటున్నారనే ఫిర్యాదులపై అధికారులు స్పందించి సమగ్ర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిని పనుల నుంచి బయటకు తీసుకురావడంతో పాటు, వారి కుటుంబ పరిస్థితులను గుర్తించి విద్యకు దూరం కాకుండా పునరావాస చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నందికొట్కూరు పట్టణంలో బాల కార్మికుల పరిస్థితిపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.