ఎపిక్ ఎమోషనల్‌గా అదుర్స్ : విజయ్ దేవరకొండ
‘ఎపిక్’కు విజయ్–రష్మిక ఫిదా.. భావోద్వేగాలతో మెప్పించిన సినిమా
AMB సినిమాస్‌లో ప్రత్యేకంగా వీక్షించిన స్టార్ జంట
తండ్రీకొడుకుల ఎమోషనల్ సీన్ తనను కదిలించిందన్న విజయ్ దేవరకొండ
యువత కలలు, బాధ్యతలను సహజంగా చూపించారని దర్శకుడిపై ప్రశంసలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న వీక్షించి చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ఈ క్రేజీ జంట సినిమా చూసింది. అనంతరం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటూ చిత్ర యూనిట్‌ను అభినందించారు.

యువత భావాలను అద్దం పట్టిన సినిమా
దర్శకుడు ఆదిత్య హాసన్ నేటితరం యువత కలలు, బాధ్యతలు, భయాలను ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించారని విజయ్ దేవరకొండ ప్రశంసించారు. ముఖ్యంగా సినిమాలోని తండ్రీకొడుకుల మధ్య జరిగే భావోద్వేగ ఫోన్ కాల్ సన్నివేశం తనను ఎంతో కదిలించిందని, ఆ సీన్ చూస్తూ భావోద్వేగానికి గురైనట్లు విజయ్ తెలిపారు.
ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఎన్నో: రష్మిక
రష్మిక మందన్న కూడా చిత్రంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాలో ప్రేక్షకులు సులభంగా కనెక్ట్ అయ్యే ఎన్నో సహజమైన సన్నివేశాలు ఉన్నాయని ఆమె ప్రశంసించారు. కథ, పాత్రల భావోద్వేగాలు, వినోదం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని పేర్కొన్నారు.
పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ‘ఎపిక్’
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే ప్రీమియర్ షోల ద్వారా మంచి స్పందన అందుకుంది. సహజమైన హాస్యం, కుటుంబ భావోద్వేగాలు, యువత జీవితానికి దగ్గరగా ఉండే అంశాలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర బృందం తెలిపింది.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటనతో పాటు దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన తీరు సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
