Epic | ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి మరో పాట!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: యువతను ఆకట్టుకునే ప్రేమకథతో తెరకెక్కుతున్న ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మూడు పాటలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్రబృందం నాలుగో పాట ‘సబ్‌కో’ ను విడుదల చేసింది. ఉత్సాహభరితమైన సంగీతంతో సాగుతున్న ఈ పాటకు శ్రోతల నుంచి మంచి స్పందన వస్తోంది.
సినిమా ప్రచారంలో భాగంగా వరుసగా పాటలను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది చిత్రబృందం. ఇప్పటివరకు వచ్చిన మూడు పాటలు సినిమాలోని ప్రేమ, స్నేహం, యువత భావోద్వేగాలను పరిచయం చేయగా.. తాజాగా విడుదలైన ‘సబ్‌కో’ పాటకు భిన్నమైన ఉత్సాహభరితమైన శైలిని ఎంచుకున్నారు.
బేబీ తరువాత ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా కనిపించనున్నారు. మరోసారి ఈ జంట కలిసి తెరపై కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సూపర్ హిట్ 90స్ వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. యువతకు దగ్గరగా ఉండే కథాంశంతో సినిమాను రూపొందిస్తున్న ఆయన.. పాత్రల మధ్య భావోద్వేగాలు, సంబంధాలను సహజంగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ రావడంతో తాజా పాటపై కూడా ఆసక్తి నెలకొంది. ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.
