దసరా నాటికి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పూర్తి చేయాలి..
ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు, కమిషనర్ రామచంద్ర మోహన్
చెన్నై ప్లానర్లతో క్యూ కాంప్లెక్స్ అనుసంధానంపై చర్చలు
మహామండపం, నూతన అన్నదాన భవనాల పరిశీలన
భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులు సిద్ధం చేయాలని ఆదేశం
(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులను దసరా నవరాత్రి ఉత్సవాల నాటికి వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, కమిషనర్ కె.రామచంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్‌ను ప్రధాన ఆలయ మార్గంతో అనుసంధానించే అంశాలపై చెన్నైకి చెందిన ప్లానర్లతో ఉన్నతాధికారులు చర్చించారు.
భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా అనుసంధాన పనులు చేపట్టే విధానంపై సాంకేతిక అంశాలను పరిశీలించారు. మహామండపంలోని క్యూ లైన్లలో అధికారులు స్వయంగా నడిచి భక్తుల రద్దీ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల ప్రారంభించిన కనకదుర్గ అన్నప్రసాద సదనంతో పాటు మహామండపంలోని వివిధ విభాగాలను తనిఖీ చేసి సేవల నిర్వహణపై ఆరా తీశారు. దసరా ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఈఓ శీనా నాయక్ దేవాదాయ శాఖ ముఖ్య ఇంజినీర్ శేఖర్, ఈఈ ఎల్.రమాదేవి, డీఈఈలు, ఏఈవోలు, చెన్నై ప్లానర్ల బృందం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
