జిల్లా పరిషత్‌ ఎన్నికలకు ఫోటో ఓటర్ల జాబితా విడుదల

48 జెడ్‌పీటీసీ స్థానాలకు జాబితాల ప్రచురణ.. పేర్లు సరిచూసుకోవాలని అధికారుల సూచన

ఏలూరు, ఆంధ్రప్రభ: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 48 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించిన ఫోటో ఓటర్ల జాబితాలను ఈ నెల 11న ప్రచురించినట్లు జిల్లా పరిషత్‌ ఇన్‌చార్జి సీఈఓ జి.వి.కె. మల్లికార్జునరావు తెలిపారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఈ జాబితాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం-1994 నిబంధనలు, ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ ప్రకారం జాబితాలను విడుదల చేసినట్లు తెలిపారు. జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల (జెడ్‌పీటీసీ) రెండో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు.

ఓటర్లు తమ పేర్లు ఫోటో ఓటర్ల జాబితాలో సక్రమంగా ఉన్నాయో, లేదో పరిశీలించుకోవాలని ఇన్‌చార్జి సీఈఓ మల్లికార్జునరావు సూచించారు. పేర్లు, ఇతర వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే సంబంధిత నిబంధనల ప్రకారం పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితాలు కీలకమైనందున ప్రతి ఒక్కరూ తమ వివరాలను ముందుగానే సరిచూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.