లోకేష్‌తో ఎంపీ మహేష్ యాదవ్ భేటీ
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతి..
జిల్లా రాజకీయాలపైనా చర్చ
ఏలూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో ఏలూరు ఎంపీ మహేష్ యాదవ్ భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం ఉండవల్లి నివాసానికి వెళ్లిన ఎంపీ.. జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రితో చర్చించారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఏలూరులో బీసీ హాస్టల్ నిర్మాణానికి రూ.2 కోట్లు, పట్టణంలో జిల్లా గ్రంథాలయం నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొయ్యలగూడెంలో ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ఆర్థిక శాఖ నుంచి ఆర్థిక అనుమతులు ఇప్పించాలని, నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆధునికీకరణ, సౌకర్యాల కల్పనకు రూ.12 కోట్లు కేటాయించాలని కోరారు.
ఎంపీ మహేష్ యాదవ్ అందజేసిన వినతిపత్రంలోని అంశాలను పరిశీలించిన మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఏలూరు పార్లమెంట్ పరిధిలోని రాజకీయ పరిస్థితులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇరువురూ కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఎంపీ మహేష్ యాదవ్ చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాల వివరాలతో రూపొందించిన ‘ఏలూరు పార్లమెంట్‌లో గత రెండేళ్లు’ పుస్తకాన్ని నారా లోకేష్‌కు అందించారు. పుస్తకాన్ని పరిశీలించిన లోకేష్.. చేసిన పనులను ఇలా పుస్తక రూపంలో తీసుకురావడం బాగుందని ప్రశంసించారు.
