Eluru – Collector | విద్యార్థినులతో గడిపిన కలెక్టర్‌ వెట్రిసెల్వి

Eluru – Collector | ఏలూరు, ఆంధ్రప్రభ : జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలంటే కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని జిల్లా కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అన్నారు. స్థానిక జేవియర్‌నగర్‌లోని నంబర్‌-2 కళాశాల బీసీ విద్యార్థినుల వసతిగృహాన్ని మంగళవారం రాత్రి ఆమె ఆకస్మికంగా సందర్శించారు. వసతిగృహంలోని విద్యార్థినులతో రెండు గంటలకు పైగా గడిపి వారి విద్య, భవిష్యత్‌ లక్ష్యాలు, వాటిని సాధించేందుకు రూపొందించుకున్న ప్రణాళికలను ఒక్కొక్కరినీ అడిగి తెలుసుకున్నారు. వసతిగృహంలోని గదులు, సౌకర్యాలు, మరుగుదొడ్లను పరిశీలించారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వసతిగృహ రికార్డులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయన్నారు. చదువుకోవాలనే అభిలాష, ఉజ్వల భవిష్యత్తు సాధించాలనే తపన ఉన్నవారు తాము ఎంచుకున్న కోర్సును ఇష్టంతో అభ్యసించాలన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవడంతో పాటు వాటిని సాధించేందుకు పటిష్టమైన ప్రణాళికతో చదివితే ఉన్నతస్థాయికి చేరుకోవడం ఖాయమన్నారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోందని, ప్రభుత్వ చేయూతతో తాము కోరుకున్న ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చన్నారు.

సంక్షేమ వసతిగృహాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించినట్లు కలెక్టర్‌ తెలిపారు. వసతిగృహంలో ఇంటర్‌ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ వరకు చదువుతున్న విద్యార్థినులు ఉండటాన్ని ఆమె గమనించారు. వారి విద్యా ప్రగతి, భవిష్యత్‌ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి నేలపైనే కూర్చుని సహపంక్తి భోజనం చేశారు. వంటకు వినియోగించే సరుకులు, కూరగాయలు, వంటగది పరిశుభ్రతను పరిశీలించారు.

ఫ్రెషర్స్‌ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థినులకు కలెక్టర్‌ వెట్రిసెల్వి బహుమతులు, నోట్‌ పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌. శ్రావణ్‌కుమార్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ విశ్వమోహన్‌రెడ్డి, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి టి. వెంకటేశ్వర్లు, వసతిగృహ వార్డెన్‌ జాన్సీ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.

-visits-bc-girls-hostel-encourages-students-to-study-with-interest