నూతన సీఐగా కొండ్రు శ్రీనివాస్‌ బాధ్యతల స్వీకరణ

శాంతిభద్రతల పరిరక్షణకు తొలి ప్రాధాన్యత.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌ నూతన ఇన్‌స్పెక్టర్‌గా కొండ్రు శ్రీనివాస్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2009 బ్యాచ్‌కు చెందిన శ్రీనివాస్‌ గతంలో హుస్నాబాద్‌, వరంగల్‌, అవినీతి నిరోధక విభాగాల్లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆయా విభాగాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి అధికారిగా గుర్తింపు పొందారు.

బదిలీపై ఎల్కతుర్తికి వచ్చిన ఆయన పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నేరాల నియంత్రణకు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజల సహకారంతో శాంతిభద్రతలను మరింత పటిష్టంగా పరిరక్షిస్తామని నూతన సీఐ శ్రీనివాస్‌ పేర్కొన్నారు.