విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ విచారం
- ఘటనపై విచారణకు ఆదేశం
- వన్యప్రాణుల సంచార ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
మంగళగిరి, ఆంధ్రప్రభ ప్రతినిధి: చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద మామిడి తోటలో విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ శాఖ ఉన్నతాధికారుల ద్వారా ఆయన తెలుసుకున్నారు.
బోర్‌వెల్ మోటార్‌కు అనుసంధానించిన విద్యుత్ తీగ తక్కువ ఎత్తులో ఉండటంతో ఏనుగుకు తగిలి ఉంటుందని, ఆ సమయంలో విద్యుత్ సరఫరా కొనసాగుతుండటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్లు పవన్ కల్యాణ్‌కు వివరించారు.
ఏనుగు మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల నిబంధనలు, నిర్దేశిత విధివిధానాల ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగును ఖననం చేయాలని సూచించారు.
వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
