ఆ కుటుంబాల్లో వెలుగు వచ్చేది ఎప్పుడు..?

ఆ కుటుంబాల్లో వెలుగు వచ్చేది ఎప్పుడు..?

కుబీర్ (ఆంధ్రప్రభ) : నిర్మల్ జిల్లా (Nirmal District) కుబీర్ మండలానికి చెందిన రంజని తండా గ్రామస్థులు తీవ్రమైన విద్యుత్ సమస్యలతో సతమతమవుతున్నారు. సుమారు 50 కుటుంబాలు నివసించే ఈ తండాలో రోడ్డున ఇరువైపు ఉన్న కుటుంబాలు ఇరవై సంవత్సరాలుగా సరైన విద్యుత్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. విచిత్రమేమిటంటే.. ఇళ్లకు విద్యుత్ మీటర్లు (meters) ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు అధికారులు కరెంట్ పోల్స్ (electric poles) ఏర్పాటు చేయలేదు.


గ్రామస్థులు తమ ఇళ్లకు మీటర్లు ఏర్పాటు చేసుకుని దశాబ్దాలు గడిచినా, విద్యుత్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలు.. ముఖ్యంగా కరెంట్ పోల్స్ – లేకపోవడంతో, వారు ఇప్పటికీ తాత్కాలిక, ప్రమాదకరమైన పద్ధతుల్లో విద్యుత్‌ను పొందుతున్నారు. చిన్నపాటి వర్షం వచ్చినా, గాలి వీచినా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.


విద్యుత్ లేకపోవడంతో విద్యార్థుల చదువులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రాత్రిపూట చీకట్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. స్థానిక ప్రజలు ఈ సమస్య పై ఎన్నోసార్లు స్థానిక విద్యుత్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలి. రంజని తండాకు వెంటనే కరెంట్ పోల్స్ మంజూరు చేసి, సురక్షితమైన, నిరంతరాయమైన విద్యుత్ సరఫరాను అందించాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. స్థంబాల ప్రతిపాదనలు పంపించామని.. ఇదే కాకుండా రంజిని తండా బ్రహ్మేశ్వర వారికి కూడా కరెంటు, స్థంభాలను త్వరలోనే వేయిస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు.

Leave a Reply