Election Commission | ఎస్‌ఐఆర్‌పై ప్రతిపక్షాల ఆరోపణలకు ఈసీ వివరణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లను తొలగించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఎన్నికల సంఘం (ఈసీ) క్లారిటీ ఇచ్చింది. ఎస్‌ఐఆర్‌ కింద ఓటర్లను తొలగించలేదని.. క్షేత్రస్థాయి పరిశీలనలో వివిధ కారణాలతో గుర్తించలేకపోయిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన, మరణించిన లేదా నకిలీగా గుర్తించిన ఓటర్ల వివరాలను ప్రత్యేక కేటగిరీల్లో చేర్చినట్లు వెల్లడించింది.

ఈసీ గణాంకాల ప్రకారం.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలోని మూడు దశల్లో దేశవ్యాప్తంగా మొత్తం 95.40 కోట్ల మంది ఓటర్లను సమీక్షించారు. ఈ పరిశీలనలో 13.39 కోట్ల మంది ఓటర్లను ఏఎస్‌డీడీ, ఇతర కేటగిరీల కింద గుర్తించారు. ఏఎస్‌డీడీ కేటగిరీలో గైర్హాజరు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన, మరణించిన, నకిలీగా గుర్తించిన ఓటర్లు ఉంటారు.

ఈసీ గణాంకాలు ఇలా..

  • గైర్హాజరు / గుర్తించలేనివారు: 3.01 కోట్లు
  • శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలినవారు: 6.30 కోట్లు
  • మృతులు: 2.80 కోట్లు
  • నకిలీ ఓటర్లు: 1.02 కోట్లు
  • ఇతర కేటగిరీలు: 0.26 కోట్లు
  • మొత్తం: 13.39 కోట్లు

పది లక్షలకుపైగా బీఎల్‌ఓలతో పరిశీలన

ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు దేశవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్‌ఓలు) పనిచేసినట్లు ఈసీ అధికారి తెలిపారు. వారి విస్తృత పరిశీలన అనంతరం ఏఎస్‌డీడీ జాబితాలను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ జాబితాలను బూత్‌ల వారీగా 22 లక్షలకుపైగా రాజకీయ పార్టీల బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు (బీఎల్‌ఏలు) అందించినట్లు ఈసీ పేర్కొంది. దీంతో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా వివరాలను పరిశీలించే అవకాశం కల్పించినట్లు తెలిపింది.

అభ్యంతరాలకు నెల రోజుల గడువు

ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన అనంతరం.. తమ పేర్లు జాబితాలో లేవని భావించే ఓటర్లకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు నెల రోజుల సమయం ఇచ్చినట్లు ఈసీ తెలిపింది.ఈ సమయంలో అర్హత ఉన్న వ్యక్తులు తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చాలని కోరవచ్చు. అదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో చేర్చినట్లు భావిస్తే వాటిపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయవచ్చని స్పష్టం చేసింది.

పేరు పొరపాటున తొలగితే ఏం చేయాలి?

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అనుకోకుండా నిజమైన, అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో లేకుండా పోయినా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. క్లెయిమ్‌లు, అభ్యంతరాల ప్రక్రియ ద్వారా పేరు చేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.అదనంగా, తదుపరి ఫారం-6 ద్వారా కూడా ఓటర్ల జాబితాలో పేరును చేర్చుకోవచ్చని పేర్కొంది.

క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసినప్పటికీ తుది ఓటర్ల జాబితాలో పేరు చేర్చకపోతే.. సంబంధిత వ్యక్తికి అప్పీల్‌ చేసుకునే అవకాశం కూడా ఉందని ఈసీ వెల్లడించింది. జిల్లా ఎన్నికల అధికారిని సంప్రదించి అప్పీల్‌ చేసుకోవచ్చని తెలిపింది.

‘తొలగింపు కాదు.. ధ్రువీకరణ ప్రక్రియ’

ఎస్‌ఐఆర్‌ సమయంలో 13 కోట్లకుపైగా ఓటర్ల పేర్లు తొలగించారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎస్‌ఐఆర్‌లో గుర్తించిన 13.39 కోట్ల మంది వివరాలు నేరుగా తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓట్ల సంఖ్య కాదని, క్షేత్రస్థాయి ధ్రువీకరణలో వివిధ కేటగిరీల కింద గుర్తించిన ఓటర్ల వివరాలని ఎన్నికల సంఘం చెబుతోంది. అర్హులైన ఓటర్లకు తమ పేర్లను తిరిగి చేర్చుకునేందుకు నిర్దిష్ట ప్రక్రియను అందుబాటులో ఉంచామని ఈసీ స్పష్టం చేసింది. దీంతో ఎస్‌ఐఆర్‌పై రాజకీయ పార్టీల మధ్య కొనసాగుతున్న వివాదంలో ఎన్నికల సంఘం వివరణ కీలకంగా మారింది.