ఎన్నికల సంఘం బిగ్ రివిజన్
- 12 రాష్ట్రాల్లో SIR షురూ!
- నకిలీ ఓట్లకు చెక్!
భారత ఎన్నికల సంఘం (ECI) ఓటర్ల జాబితాను సరిదిద్దేందుకు ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‘ (SIR) కార్యక్రమాన్ని ప్రకటించింది. ముఖ్య ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ సోమవారం సాయంత్రం మీడియాకు ఈ వివరాలను తెలిపారు. SIR ద్వారా ఓటు హక్కుకు అర్హులైన వారందరినీ జాబితాలో చేరుస్తారు, అనర్హులుగా ఉన్నవారి పేర్లను తొలగిస్తారు. ఎన్నికలకు ముందు ఈ సమీక్ష చాలా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ SIR కార్యక్రమం మొదటగా ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో మొదలవుతుందని ఆయన వివరించారు. దేశంలోని మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. బీహార్‌లో ఈ ప్రక్రియ విజయవంతం అయిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, ఎంపిక చేసిన రాష్ట్రాల్లో SIRను అమలు చేస్తారు. బీహార్ ప్రజలు ఈ ప్రత్యేక సమీక్షపై తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారని CEC తెలియజేశారు. చివరిసారిగా 21 ఏళ్ల క్రితం దేశంలో ఈ తరహా ప్రత్యేక సవరణ జరిగిందని CEC గుర్తు చేశారు.
ఈ ప్రక్రియలో, బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) మూడుసార్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సమాచారాన్ని సేకరిస్తారు. SIR అమలు చేయబోయే రాష్ట్రాల్లో ఈరోజు (సోమవారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి ఓటరు జాబితాను నిలిపివేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రకటించారు.
ఇతర రాష్ట్రాలకు వలసవెళ్లే ఓటర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్ నింపాలని ఆయన సూచించారు.
2026లో ఐదు రాష్ట్రాల్లో – అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో – అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేపట్టరు.. ఎందుకంటే స్థానిక యంత్రాంగం ఆ ఎన్నికల పనులతో బిజీగా ఉంటుందని ఆయన వివరించారు.
కాగా, బీహార్‌లో SIR ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. దాదాపు 7.42 కోట్ల ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 30న ప్రచురించారు. బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి, ఫలితాలు నవంబర్ 14న వెలువడతాయి.

