పల్నాడులో రేపు ఎన్నికల సమరం!

  • 10 జడ్పీటీసీ, 37 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
  • 18 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం.. 31 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో

పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని 28 జడ్పీటీసీ స్థానాలకు గాను 18 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 10 స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ స్థానాల్లో మొత్తం 31 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఏకగ్రీవమైన 18 జడ్పీటీసీ స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే ఎన్నికైనట్లు ప్రకటించారు.

జిల్లాలోని మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, రెంటచింతల, చిలకలూరిపేట, ఎడ్లపాడు, నాదెండ్ల, నరసరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, బొల్లాపల్లి, ఈపూరు, శావల్యాపురం, పెదకూరపాడు, అమరావతి, బెల్లంకొండ, అచ్చంపేట మండలాల్లో జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.మరోవైపు రాజుపాలెం, క్రోసూరు, ముప్పాళ్ల, నకరికల్లు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచవరం, గురజాల, దాచేపల్లి, నూజెండ్ల మండలాల్లోని జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

37 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

జిల్లాలో మొత్తం 419 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 382 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 37 స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. చిలకలూరిపేట, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో ఒక్కో ఎంపీటీసీ స్థానానికి, సత్తెనపల్లి మండలంలో 21, నూజెండ్ల మండలంలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ఎన్నికల నేపథ్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పోలింగ్ మెటీరియల్ పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో కుర్చీలు, టేబుళ్లు, బారికేడ్లు, లౌడ్ స్పీకర్లు, తాగునీరు, విద్యుత్, సీసీటీవీ, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను తనిఖీ చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఓటర్ల జాబితాలు, స్టాంపులు, ఇంకు, కవర్లు, స్టేషనరీ కిట్లను పరిశీలించారు.

ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన సామగ్రి పూర్తిస్థాయిలో చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి భోజనం, టీ, తాగునీరు అందుబాటులో ఉంచాలని, రాత్రి బస చేసేవారికి వసతి, దుప్పట్లు, ఫ్యాన్లు కల్పించాలని సూచించారు. మహిళా సిబ్బందికి ప్రత్యేక వసతి, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం: జేసీ సంజన శ్రీహర్ష

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన శ్రీహర్ష తెలిపారు. నవంబర్ 5న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

జిల్లా కేంద్రం నరసరావుపేటలోని ఏఎం రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.