ప్రాణాపాయ స్థితిలో వృద్ధ మహిళకు చికిత్స
పట్టించుకోని కుటుంబ సభ్యులు.. అయోమయంలో వైద్యులు
మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వృద్ధ మహిళకు కుటుంబ సభ్యుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో వైద్యులు అయోమయానికి గురయ్యారు. అయినప్పటికీ మానవతా దృక్పథంతో ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
లక్షెట్టిపేట మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన శంకరి గట్టమ్మ (70) అనారోగ్యానికి గురికావడంతో సోమవారం రాత్రి 10 గంటలకు మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స ప్రారంభించేందుకు ఆస్పత్రి నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యుల సంతకం అవసరమని సిబ్బంది తెలిపారు. అయితే, కుటుంబ సభ్యులు స్పందించకపోవడంతో మంగళవారం ఉదయం వరకు పరిస్థితి కొనసాగింది. ఈ నేపథ్యంలో గట్టమ్మ ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు, పట్టణ ప్రజలు ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మంచిర్యాల సీఐ ప్రమోద్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆస్పత్రి వైద్యుడు శ్రీనివాసు మాట్లాడుతూ.. సోమవారం రాత్రి వీల్‌చైర్‌పై గట్టమ్మను ఐసీయూకు తీసుకువచ్చి బెడ్‌పై చేర్చినప్పటి నుంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అయితే, చికిత్సకు సంబంధించిన చెల్లింపులు చేయకపోవడంతో పాటు, కనీసం కేస్షీట్పై కూడా సంతకం చేయకుండా కుటుంబ సభ్యులు కాలయాపన చేస్తున్నారని చెప్పారు. ఒక ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందనే ఉద్దేశంతో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగిస్తున్నామని తెలిపారు. సీఐ ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ.. ఆస్పత్రి యాజమాన్యం నుంచి గానీ, గట్టమ్మ బంధువుల నుంచి గానీ ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఆస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
