జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమీక్ష
నంద్యాల, ఆంధ్రప్రభ ప్రతినిధి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు.
నవంబరు 5న జరగనున్న ఎన్నికల సన్నద్ధతపై బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షలో కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నంద్యాల కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ సునీల్ షొరాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల నిర్వహణలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు, సిబ్బందికి కనీస మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి అదనపు భద్రత కల్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
