రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
- గన్నవరం విమానాశ్రయంలో కలెక్టర్ డీకే బాలాజి సమీక్ష
- లా అండ్ ఆర్డర్, బందోబస్తుకు అత్యధిక ప్రాధాన్యం..
- శాఖల మధ్య సమన్వయంపై ఆదేశాలు
గన్నవరం, ఆంధ్రప్రభ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14, 15 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. గురువారం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఇతర శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు.
విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్ టెర్మినల్ వద్ద నిర్వహించిన సమీక్షలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. లా అండ్ ఆర్డర్, పోలీస్ బందోబస్తు, ప్రోటోకాల్, ట్రాఫిక్ నియంత్రణ, రవాణా, పార్కింగ్, విమానాశ్రయ భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, రాష్ట్రపతి రాకపోకల మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీకి సూచించారు. భద్రతా ప్రణాళిక ప్రకారం ముందస్తు తనిఖీలు నిర్వహించి, ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా..
రాష్ట్రపతి పర్యటన జరిగే ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా ఏపీసీపీడీసీఎల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రీన్ రూమ్‌లు, టెర్మినల్ ప్రాంతం, భద్రతా ప్రాంతాలు, పార్కింగ్, వాహనాల మార్గాల్లో ముందస్తుగా విద్యుత్ ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు జనరేటర్లు, ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు, అదనపు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
రాష్ట్రపతితో పాటు వచ్చే ఉన్నతాధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేయనున్న గ్రీన్ రూమ్‌లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రీన్ రూమ్‌లలో భద్రత, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ప్రతి గ్రీన్ రూమ్‌ను సంబంధిత అధికారులు స్వయంగా తనిఖీ చేసి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని ఆదేశించారు.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గ్రీన్ రూమ్‌లు, ఇతర కీలక ప్రాంతాల్లో ఫైర్ టెండర్లు, అగ్నిమాపక సిబ్బంది, అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచాలని ఫైర్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లో ముందస్తు తనిఖీలు నిర్వహించి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు.
ఆహార భద్రత.. వైద్య సేవలు
రాష్ట్రపతితో పాటు వచ్చే అధికారులు, సిబ్బందికి అందించే ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సిబ్బందిని నియమించి ఆహార పదార్థాలను తనిఖీ చేయాలని సూచించారు.అదేవిధంగా వైద్య బృందాలు, అంబులెన్సులు, అత్యవసర వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పారిశుద్ధ్యం.. తాగునీటికి ఏర్పాట్లు
విమానాశ్రయం పరిసరాలు, గ్రీన్ రూమ్‌లు, పార్కింగ్ ప్రాంతాలు, రాకపోకల మార్గాల్లో పారిశుద్ధ్య నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. తాగునీటి సదుపాయాలను కూడా తగినంతగా కల్పించాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రపతి పర్యటన అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలీస్, రెవెన్యూ, ప్రోటోకాల్, ఆర్‌టీఓ, ఏపీసీపీడీసీఎల్, ఫైర్, వైద్య ఆరోగ్య, ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్, పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్, ఎయిర్‌పోర్ట్ అథారిటీ, కమ్యూనికేషన్ తదితర శాఖలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను ముందుగానే పూర్తి చేసి, క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాలని సూచించారు. ఎలాంటి అలసత్వానికి తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించి రాష్ట్రపతి పర్యటన విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్షలో గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రమణ్యం, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కె. లక్ష్మీకాంతరెడ్డి, విమానాశ్రయ సీఎస్‌వో కె. ధర్మేంద్ర, ఇంటెలిజెన్స్ అధికారి చప్పిడి రాజా, జాతీయ రహదారుల సంస్థ పీడీ విద్యాసాగర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ సత్య కిషోర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
