వాడిన నీటితో భూగర్భ జలాల పెంపునకు కృషి
జాగిర్యాల్ పాఠశాలలో సోక్‌పిట్ నిర్మాణం పూర్తి..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: వృథాగా పోతున్న నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలాలను పెంపొందించడంతో పాటు విద్యార్థుల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు భీమ్‌గల్ మండలం జాగిర్యాల్ జడ్పీహెచ్‌ఎస్‌లో వినూత్న కార్యక్రమం చేపట్టారు.
పాఠశాలలోని హ్యాండ్‌వాష్ యూనిట్ నుంచి వెలువడే వాడిన నీరు వృథాగా బయటకు వెళ్లకుండా కమ్యూనిటీ సోక్‌పిట్ (ఇంకుడు గుంత) నిర్మించారు. ఈ పనులు పూర్తికావడంతో హ్యాండ్‌వాష్‌కు వినియోగించిన నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల పెంపునకు దోహదపడనుంది.
ఈ నిర్మాణం ద్వారా నీటి సంరక్షణ ప్రాధాన్యతను తెలుసుకున్న విద్యార్థులు తమ ఇళ్ల వద్ద కూడా ఇలాంటి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నీటి పొదుపుపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. విద్యార్థుల ఆలోచనపై గ్రామ సర్పంచ్ గడాల ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటి వద్ద ఇలాంటి నిర్మాణాలు చేపడితే భూగర్భ జలాల పెంపునకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
