సుదర్శన్‌కు ఆపరేషన్ ముస్కాన్ అవార్డు
తప్పిపోయిన, బడిమానేసిన పిల్లల గుర్తింపులో విశేష సేవలు
హసన్‌పర్తి, ఆంధ్రప్రభ : ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సమితి హనుమకొండ జిల్లా సమన్వయకర్తగా పనిచేస్తున్న ఈసంపల్లి సుదర్శన్‌కు ఆపరేషన్ ముస్కాన్-12 అవార్డు లభించింది. హనుమకొండ అశోక్ భవన్‌లో వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో నేర విభాగం, మహిళా భద్రతా విభాగం జిల్లా సమన్వయకర్త సదయ్య చేతుల మీదుగా సుదర్శన్ అవార్డును అందుకున్నారు.
ఈ ఏడాది జూలై 1 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో సుదర్శన్ విశేష సేవలు అందించారు. తప్పిపోయిన, ఇంటి నుంచి వెళ్లిపోయిన, అనాథ పిల్లలను గుర్తించడంతో పాటు బడిమానేసిన పిల్లలు, బాల కార్మికులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేశారు.
పిల్లల సంక్షేమం కోసం సుదర్శన్ చేసిన సేవలను గుర్తించిన అధికారులు ఆయనను ఆపరేషన్ ముస్కాన్-12 అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సేవలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసి ప్రదానం చేసిన ఉన్నతాధికారులకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి పిల్లల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని సుదర్శన్ తెలిపారు.
