ఈ నెల 5న శ్రీ ఈదమ్మ దేవతా విగ్రహ ప్రతిష్ఠాపన
గుడిమల్కాపురంలో ముస్తాబైన ఆలయం.. భక్తులకు అన్నప్రసాద వితరణ
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్‌లోని సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపురం గ్రామంలో శ్రీ ఈదమ్మ దేవతా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రామ సంక్షేమం, లోకకల్యాణాన్ని ఆకాంక్షిస్తూ గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలనే సంకల్పంతో నూతన ఆలయాన్ని నిర్మించారు.
శ్రీ పరాభవ నామ సంవత్సరం శ్రావణ మాస బహుళ నవమి శనివారం ఈ నెల 5న శుభ ముహూర్తంలో శ్రీ ఈదమ్మ దేవతా విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఉదయం 7.45 గంటలకు గణపతి పూజ, ధ్వజారోహణం, రక్షాబంధనం, పుణ్యాహవాచనం, పంచగవ్య మేళనం, మంటపారాధన, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి జలాధివాసం, ధాన్యాధివాసం, శయ్యాధివాసం, పుష్పాధివాసం, ఏకాదశ దుర్గాసూక్త హోమం, పూర్ణాహుతి నిర్వహించనున్నారు.
ఉదయం 11.09 గంటలకు మృగశిర నక్షత్రయుక్త తులా లగ్న పుష్కరాంశ సుముహూర్తంలో శ్రీ ఈదమ్మ దేవతా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం జరగనుంది. అనంతరం అమ్మవారికి ఏకాదశ రుద్రాభిషేకం, దుర్గాసూక్త నిహిత రుద్రాభిషేకం, అలంకరణ, పుష్పార్చన, కుంకుమార్చన, మంగళ నీరాజనం, ఆశీర్వచనం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ ఉంటుంది.
మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులు, గ్రామస్థులకు నిరంతర అన్నప్రసాద వితరణ చేపట్టనున్నారు. గ్రామస్థులు, భక్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించి ఈదమ్మ తల్లి కృపాకటాక్షాలు పొందాలని గుడిమల్కాపురం గ్రామ ప్రజలు కోరారు.
