ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల అవస్థలు..
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
45 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయురాలు..
రోడ్డుపై తల్లిదండ్రులు, గ్రామస్తుల ధర్నా
నాంపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యార్థులు రోడ్డుపై ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని పేర్కొన్నారు. ధర్నాతో రోడ్డుపై వాహనాలు బారులు తీరడంతో నాంపల్లి సీఐ దూది రాజు, ఏఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధర్నాను విరమింపజేసి, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
