కరోనా కన్నా దోమకాటుతో వ్యాపిస్తున్న జ్వరాలు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా కరోనా మీద కేంద్రీకృతం కావడంతో ఇతర వ్యాధులపై పరిశోధనలు అడుగంటాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ.. డెంగీ, మలేరియా నిరోధానికి వచ్చిన టీకాలు ఆ ఆరోపణల లో పసలేదని తేల్చాయి. ఈ రెండు టీకాలు మానవాళికి గొప్పవరంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడో 130 ఏళ్ల క్రితం రోనాల్డ్ రాస్ మలేరియా పరాన్నజీవిని మన హైదరాబాద్‌లోనే గుర్తించారు. అప్పటినుంచి దీని నిరోధానికి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే అవేవీ ఫలించలేదు. ఎట్టకేలకు ఇప్పుడీ కృషి ఫలించింది. బ్రిటన్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జీఎస్‌కే సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. ఆర్టీఎస్-ఎస్ /ఏఎస్01 పేరుతో రూపొందించిన ఈ వ్యాక్సిన్ బ్రాండ్ నేమ్ ‘మస్కిరిక్స్’. ప్రాణాంతక మలేరియాను ఇది నిరోధిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. అంతేకాదు.. దీని వినియోగానికి ఆమోదంకూడా తెలిపింది. ఈ దశాబ్దం చివరికల్లా మలేరియాను దేశం నుంచి తరిమి కొట్టాలన్న భారత లక్ష్యానికి ఈ టీకా చేదోడుగా నిలవనున్నది. మలేరియా పరాన్న జీవులను నియంత్రించేందుకు రూపొందించిన తొలి టీకా ఇదే. జీఎస్‌కే సంస్థ 30 ఏళ్లు కష్టపడి దీనిని అభివృద్ధి చేసింది. ఆడ ఎనాఫిలిస్ దోమ కాటు ద్వారా సంక్రమించే ప్లాస్మోడియం జాతి పరాన్న జీవుల వల్ల మలేరియా సోకుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 2019లో 23 కోట్ల మందికి మలేరియా సోకింది. నాలుగు లక్షల మంది మరణించారు. మరణించిన వారిలో 2.74లక్షల మంది ఐదేళ్ల లోపు చిన్నారులే. సబ్‌సహారాలోని ఆఫ్రికా దేశాలలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. మన దేశంలో కూడా ఈ వ్యాధి పీడుతులు ఎక్కువే. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశంలో మలేరియా కేసులు ఏటా ఏడున్నర కోట్లు దాటేవి. అయితే.. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల ఇది తగ్గుముఖం పట్టింది. వ్యాక్సిన్ లేకున్నా ఇండియా మలేరియా కట్టడిలో మంచి ఫలితాలు సాధించిం దని డబ్ల్యూహెచ్‌ఓ కూడా కితాబు ఇచ్చింది. ముఖ్యంగా 2000 నుంచి 2019 మధ్య మలేరియా కేసులు 71.8 శాతం తగ్గాయని, మరణాలు 73.9 శాతం తగ్గాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చర్యలకు తోడు ఇప్పుడీ టీకా పంపిణీని కూడా ముమ్మరం చేస్తే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవచ్చునని వైద్య రంగం నిపుణులు అంటున్నారు. అదే విధంగా దోమ కాటు ద్వారానే వ్యాపించే డెంగీ వ్యాధి కూడా అనేక దేశాలను వణికిస్తున్నది. దీని నిరోధానికి సంబంధించి జపాన్‌కు చెందిన తకేడా ఫార్మా కంపెనీ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఈ సంస్థ భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకున్నది. త్వరలో అనుమతులు లభించవచ్చునని అంటున్నారు. సరైన ఔషధాలు లేని డెంగీ వ్యాధి మన దేశంలో చాలా మందిని పొట్టనపెట్టుకుంటున్నది. ఏటా లక్షలాది మంది దీని బారిన పడుతున్నారు. వేలాది మంది మరణిస్తున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలలో డెంగీ విశ్వరూపం చూపిస్తున్నది. దక్షిణాదిన కూడా దీని ప్రభావం చాలా ఎక్కువే. జనవరి నుంచి ఇప్పటివరకు ఒక్క తెలంగాణలోనే 5000 పైచిలుకు డెంగీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఇలాంటి క్లిష్ట దశలో డెంగీకి కూడా టీకా అందుబాటులో రావడం హర్షణీయం. అయితే.. డెంగీకి సంబంధించినంత వరకు ఇదే తొలి టీకా కాదు. ఆ ఘనత ఫ్రాన్స్‌కు చెందిన సనోఫి అనే సంస్థకు దక్కుతుంది. ఇది తయారుచేసిన ‘డెంగావాగ్జియా’ టీకా విజయవంతంగా డెంగీని నిరోధిస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ రుజువు చేశాయి. ఇప్పటికే.. సింగపూర్, మెక్సికో, ఫిలిప్పీన్స్, బ్రెజిల్ వంటి పది దేశాలు ఈ టీకాకు అనుమతి ఇచ్చాయి. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ కూడా ఈ టీకాకు అనుమతించింది. అయితే.. మన దేశంలో ఇంకా దీనికి డీసీజీఐ అనుమతి లభించలేదు. అటు మలేరియా కు, ఇటు డెంగీకి టీకాలు అందుబాటులోకి వస్తే కోట్లాది మందికి ఊరట లభిస్తుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement