చట్టసభల్లో గౌరవ సభ్యులు ఉపయోగించే పదాల్లో అప్పుడప్పుడు కొన్ని అతిగానూ, మరి కొన్ని పరిధి దాటినట్టుగానూ అనిపిస్తూ ఉంటాయి. దీనినే అన్ పార్లమెంటరీ పదాలంటారు. దీంతో ఏది పార్లమెంటరీ, ఏది అన్ పార్లమెంటరీ అనే వాదం బయలుదేరుతుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు ఇలాంటి నిషేధాలను ప్రకటిస్తే ప్రతిపక్షంలో ఉన్న వారు మరింత పట్టుదలకు పోయి వాదనకు దిగడం సర్వసాధారణం. ఇంతకీ అన్ పార్లమెంటరీ అంటే ఎవరినీ వ్యక్తిగతంగా దూషించకూడదు, వ్యక్తిత్వహననానికి పాల్పడకూడదు అని స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు. చట్టసభ సభ్యులకు మార్గదర్శకంగా ఉండేందుకు లోక్‌సభ సచివాలయం చిన్న పుస్తకాలను అందిస్తూ ఉంటుంది. ఈ బుక్‌లెట్‌లో ఉండే పదాలను ఉపయోగించిన వారు తాము మాట్లాడిన పదాలు అసభ్యకరమైనవి కావనివాదిస్తూ ఉంటారు. ఇలాంటివి తరుచు జరిగేవే. ఈసారి మాత్రం లోక్‌సభ సచివాలయం ప్రచురించిన ఈ మార్గదర్శకాల పుస్తకంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభలో ఇప్పటికే తమ నోళ్ళు నొక్కుతున్నారనీ, ఇప్పుడు ఇలాంటి పుస్తకాలను విడుదల చేయడం ద్వారా తమపై చర్య తీసుకోవాలని అనుకుంటున్నారని ప్రతి పక్షాలు ఆరోపించాయి.
అయితే, ఇది ఎప్పుడూ జరిగే తతంగమేననీ, దీనికి అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వివరణ ఇచ్చారు. ఈ పుస్తకంలో ఉదహరించే పదాల్లో ఎక్కువ వాటిని తానే ఉపయోగిస్తాననీ, అవి ఏమీ తప్పుకాదనీ, భవిష్యత్‌లో కూడాఉపయోగిస్తాననీ, అరెస్టు చేసినా వెనక్కి తగ్గనని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో తమను మాట్లాడకుండా చేయడం కోసమే మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కొత్త ఎత్తుగడ అని తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డిరెక్ ఒబ్రెయిన్ ఆరోపించారు. 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది. ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ముందే దాటుకుని పోతున్న అధికార పక్షం ఎన్నిక సమయంలో అన్ పార్లమెంటరీ పదాలను ఉపయోగించారన్న ఆరోపణ తో కొంతమందిని ఓటింగ్‌లో పాల్గొనకుండా బహిష్కరించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిబంధనలను పుట్టలోంచి తీస్తున్నారన్నది ప్రతిపక్షాల అనుమానం. అయితే, కేవలం సభలో సభ్యులు ఉపయోగించే పదాలను బట్టి వారిని బహిష్కరించడం అంత సులభం కాదు. దానికి పెద్దతతంగం ఉంటుంది. అలా బహిష్కరించాల్సివస్తే మన చట్టసభ సభ్యుల్లో చాలా మంది బహిష్కృతులవుతారు.
అందువల్ల తృణమూల్ సభ్యుడిది కేవలం అను మానమే. ఇలాంటి పుస్తకాలను స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి లోక్‌సభ సభ్యులకు సర్క్యులేట్ చేస్తున్నామని స్పీకర్ చెప్పిన సమాధానానికి ఒప్పుకుని తీరాలి. అయినా, సభలో ఉపయోగించరాదని చెబుతున్న పదాలకన్నా దారుణమైనవీ, వ్యక్తిగతమైనవి సభ్యులు ఉపయోగిస్తూనే ఉన్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా సభ్యులు తీరు మార్చుకోకపోవడంతో సభాపతులు సభను వాయిదావేసి వెళ్ళిపోతున్నారు. బీహార్ వంటి శాసనసభల్లో సభ్యులు కుర్చీలతో కొట్టుకున్న సంఘటనలు మనకు తెలుసు. ఆ అలవాటుతోనే ఇటీవల అన్నా డిఎంకెలోని వైరి వర్గాలు కుర్చీలతో కొట్టుకున్నారు. సభలో గందరగోళ దృశ్యాలకు జనం అలవాటు పడిపోయారు. కొత్తగా ఎన్నికైన చట్టసభల సభ్యులు సభలో మాట్లాడేందుకు ఎన్నెన్నో కలలుకని సభకు వస్తుంటారు. కానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అధికార పార్టీ నాయకుల వాగ్వాదాలు, వాగ్యుద్ధాలతోనే సభ అర్ధంతరంగా వాయిదా పడుతుంది. ఇంతకీ నిషేధిత పదాల పేరుతో వెలుగులోకి వచ్చిన పదాల్లో శకుని అనేది ఉంది. శకుని అంటే మహా భారతంలో దుర్యోధనునికి సలహాలు ఇచ్చిన దుష్ట చతుష్టయంలో ఒకరు.. పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు కొంత పరిధిమీరి మాట్లాడం మొదటి నుంచి ఉన్నదే.
తొలి రోజులలో ఆనాటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అప్పుడే పార్లమెంటుకు ఎన్నికైన వాజ్‌పేయి భావావేశాన్నిచూసి నవ్వుకున్నారట. భవిష్యత్‌లో ఈ యువ ఎంపీ పెద్ద నాయకుడు అవుతాడని ఆనాడే ఆయన జోస్యం చెప్పారట. అలాగే, ఇందిరాగాంధీ హయాంలో రామ్‌మనోహర్ లోహియా, మధులి మాయే వంటి ప్రతిపక్ష నాయకులు ఆమెను విమర్శించేందుకు ఉపయోగించిన పదాలను అన్‌పార్లమెంటరీ అని ఆనాటిస్పీకర్ రికార్డు నుంచి తొలగించారు. అలా తొలగించడం అనేది ఇప్పటికీ ఉంది. అయితే, ప్రత్యక్ష ప్రసారాల కారణంగా సభలో చీమచిటుక్కుమన్నా జనానికి తెలిసిపోతోంది. అందువల్ల జాగ్రత్త కోసం ఈ మార్గదర్శకాలను చేసి ఉంటారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలకు ఇది ఒక అస్త్రంగా ఉపయోగపడవచ్చు. అంతకన్నాఏమీ లేదు.