దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం అవతరించిన నారసింహుడు తెలుగునాట అడుగడుగునా భక్తుల పూజలందుకుంటున్నాడు. విష్ణుమూర్తి అవతారాల్లో నాల్గవది అయిన నారసింహుని క్షేత్రాలన్నింటిలో అత్యంత ప్రాముఖ్యాన్ని కలిగిఉన్న యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ, మహా సంప్రోక్ష కార్యక్రమాలను ఎంతో శ్రద్ధాభక్తులతో, అసిధారా వ్రతంగా పూర్తి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పల్లవులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు వంటి పూర్వపు రాజుల మాదిరిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇంతటి గొప్ప కార్యాన్ని ఆయన పూర్తి చేశారనడం కన్నా, ఆ నారసింహుడే ఆయన ద్వారా ఈ మహత్తర కార్యాన్ని పూర్తి చేయించి ఉంటాడు. రాజులు లేని నేటి కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చినవారిపైనే ప్రాచీన, కళా, సాంస్కృతిక వైభవ పరంపరను కొనసాగించాల్సిన బాధ్యత ఉంది. ఒకవైపు ప్రజల ఆర్థికాభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు జేస్తూనే, ఐహిక ఆముష్మిికప్రదమైన కార్యక్రమాలను కూడా అత్యంత జయప్రదంగాపూర్తి చేయడం కేసీఆర్‌కే చెల్లింది. రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలను అమలుజేస్తూనే, గోదావరి జలాలను తెలంగాణ అంతటా పారించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఇప్పటికే ఆ ప్రాజెక్టు ఫలాలు చాలా ప్రాంతాలకు అందుతున్నాయి. యాదగిరి గుట్టను యాదాద్రిగా తీర్చిదిద్దడంలో కేసీఆర్ సంకల్పం చాలా గొప్పది. తెలుగు నాట నారసింహ క్షేత్రాల్లో సింహాద్రి, వేదాద్రి, ఖాద్రి (కదిరి), మంగళగిరి స్తంభాద్రి, మిట్టపల్లి తదితర క్షేత్రాలలో కొన్నింట నారసింహుడు రౌద్ర స్వరూపంలో కనిపిస్తారు. కానీ, యాదాద్రి నారసింహుడు బహు శాంతమూర్తి, భక్తుల కోర్కెలను ఈడేర్చే దేవునిగా తరతరాలుగా ప్రసిద్ధి పొందారు. తెలంగాణలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వెలసినఈ దివ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి యాత్రికులు తండోపతండాలుగా వస్తుంటారు. యాదాద్రి ఆలయం జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఆరు సంవత్సరాలు పట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కృష్ణశిలపైఈ ఆలయాన్ని చెక్కారు. స్థల పురాణం ప్రకారం యాద రుషి పేరిట యాదగిరి గుట్ట వెలసింది. యాద రుషి తపస్సు ఫలితంగానే లక్ష్మీన రసింహుడు ఈ గుట్టపై స్వయంభూగా వెలిశాడు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటేనే కష్టాలు తొలగి కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. యాదాద్రి వైభవాన్ని మాటల్లో వర్ణించలేం. దర్శించి స్వీయ అనుభూతిని పొందాల్సిందే. యాదాద్రిలో రోజుకు 50వేల మంది దర్శనానికి వచ్చినా, ఏ విధమైన లోటు లేకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. తిరుమల తిరుపతి మాదిరిగానే దివ్యమైన అనుభూతికి ఆలవాలంగా యాదాద్రిని తీర్చిదిద్దారు.
ఈ ఆలయ నిర్మాణ పనులను కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించారు. కనీసం 19 సార్లు యాదాద్రిని సందర్శించి నిర్మాణ కార్యక్రమాల్లో సలహాలు ఇచ్చారు. యాదాద్రి తెలంగాణ తిరుపతిగా భాసిల్లాలన్న అభిమతంతో ఆయన ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేయడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగాపూర్తి చేసినట్టే ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని అంతకన్నా మహా సంకల్పంతో పూర్తి చేశారు. కాకతీయుల కాలంలో వెలసిన రామప్ప గుడికి ఈ మధ్యనే యునిసెఫ్ అవార్డు లభించింది. అలాగే, దేశంలోని పుణ్య క్షేత్రాలన్నింటి సరసన యాదాద్రిని నిలబెట్టిన కేసీఆర్ జన్మ చరితార్థమైంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ ఘనతరమైన ఖ్యాతిదక్కింది. నిండు హృదయంతో మంచి పనిని తలపెట్టడమే సత్సంకల్పం అంటారు. అటువంటి సత్సంకల్పంతో యాదాద్రి ఆలయ జీర్ణోద్ధరణ పూర్తి చేసి భక్తులకు సకల సౌకర్యాలను కల్పించినందుకు కేసీఆర్‌ను అభినందించాల్సిందే. ఈ ఆలయ నిర్మాణాన్ని అకుంఠిత దీక్షతో పూర్తి చేసిన స్తపతులందరూ రామప్ప మాదిరిగా చరిత్రలో నిలిచి పోతారు. తెలంగాణ సాంస్కృతీ వైభవానికి ప్రతీకగా యాదాద్రి ఆలయం తరతరాల ప్రజలకు కొంగుబంగారమై నిలుస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..