ఆఫ్ఘనిస్తానను ఉగ్రవాదులకు అడ్డా కానివ్వద్దంటూ భారత్ సహా ఎనిమిది దేశాల జాతీయ భద్రతాసలహాదారుల సమావేశం పిలుపు ఇవ్వడం తో ఆఫ్ఘనిస్తాన్ పాలకులైన తాలిబన్లు దిగి వస్తారన్న నమ్మకం లేదు. ఉగ్రవాదంతో మమైకమైన తాలిబన్లు ఉగ్రవాదులకు ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాయే ప్రధాన ఆదాయ మార్గం. అటువంటి జీవన విధానానికి అలవాటు పడిన తాలిబన్లు సామాన్య పౌరుల మాదిరిగా జీవించాలనుకోవడం అత్యాశే అవుతుంది. ఢిల్లిలో బుధవారం జరిగిన ఎనిమిది దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి పొరుగు దేశాలైన పాక్, చైనాలను కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే, ఈ రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు హాజరు కాలేదు. ఇందుకు కారణాలేమిటో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. తాలిబన్లను రెచ్చగొడుతున్నది ఈ రెండు దేశాలే. తమ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని అన్ని దేశాలనూ తాలిబన్లు గడిచిన కొద్ది కాలంగా కోరుతున్నారు. ఉగ్రవాద ముద్ర పడిన దేశానికి అధిపతులుగా తాలిబన్లు ఎక్కడికి వెళ్ళినా రుణాలు లభించడం లేదు. పాకిస్తాన్ దీ అదే పరిస్థితి.
ఆఫ్ఘనిస్తాన్ను వీడి వెళ్ళిపోతూ అమెరికా అక్కడ సామాజిక పరిస్థితులు చక్కదిద్దేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగు పర్చేందుకు చొరవ తీసుకోవాలని భారత్‌ని కోరింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల అధీనంలో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నప్పుడు భారత్ ఈ విషయంలో ఎక్కువ సాహాయ పడింది. అందువల్ల సహజంగానే భారత్‌ని అమెరికా అలా కోరి ఉండవచ్చు. దీంతో చైనా, పాకిస్తాన్‌లు గుర్రు పెంచుకున్నాయి. అమెరికాతో భారత్‌కి రక్షణ రంగంలోనూ, ఇతర కీలక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండటం వల్లనే అమెరికా అలా కోరిందని ఈ రెండు దేశాల నాయకులు బహిరంగంగానే ఆరోపించారు. కానీ, ఇది వాస్తవ విరుద్ధం. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత్ మొదటి నుంచి బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహ రిస్తోంది. ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా సాహాయ పడుతున్న పాకిస్తాన్, దానికి మద్దతు ఇస్తున్న చైనా అక్కడ శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడాలనీ, పౌరులకు తగిన రక్షణ కల్పించాలని ఏనాడూ కోరలేదు.
అందుకోసం ప్రయత్నించలేదు. ఇది యావత్ ప్రపంచానికి తెలుసు. అంతర్జాతీయ ఉగ్రవాది బిన్ లాడెన్‌కి ఆశ్రయం ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్ పడిన ఉగ్రవాదముద్ర ఇప్పటికీ చెరగలేదు. అలాగే, జైష్, లష్కర్ వంటి ఉగ్రవాద సంస్థలకు పుట్టిల్లు అయిన పాకిస్తాన్‌ని కూడా పొరుగుదేశాలే కాక, ఇతర దేశాలేవీ విశ్వసించడం లేదు. ఈ పరిస్థితిలో ఆఫ్ఘనిస్తాన్లో పౌరులకు అవసరమైన ఆహార ధాన్యాలనూ, ఇతర నిత్యావసరాలను పంపేందుకు ఎన్నో విధాల సాయపడుతున్న భారత్‌కి పాక్ ఎన్నో విధాల అడ్డుపడుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలకు తిండి లేదు. భద్రత అంతకన్నా లేదు. ఇతర దేశాలకు పోయిస్వేచ్చగా బతుకుదాము అనుకున్నాతాలిబన్ల నుండి రక్షణ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. భారత్ పంపే ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసరాలు వారిప్రాణాలను నిలబెడుతున్నాయి. వాటిని కూడా అడ్డుకుంటే వారి పరిస్థితి ఏమిటన్న కనీస ఇంగితాన్ని చైనా, పాక్‌లు ప్రదర్శించడం లేదు.
ముందుగా ఆఫ్ఘనిస్తాన్ లో సుస్థిర జీవనవిధానాన్ని పునరుద్ధరించాలన్నది భారత్ వాదం. బుధవారం నాడు ఎనిమిది దేశాల భద్రతాసలహాదారుల సమావేశం విడుదల చేసిన డిక్లరేషన్ ప్రధానాంశం అదే. ఆఫ్ఘనిస్తాన్ లో అన్ని వర్గాలకూ, అన్ని ప్రాంతాలకూ న్యాయం జరిగేందుకు సమ్మిళిత అభివృద్దిని పాలకులు వెంటనేచేపట్టాలని ఈ సమావేశం పిలుపు ఇచ్చింది. తాలిబన్లు తమకు అనుకూలవర్గాలకూ, ఉత్తర ప్రావిన్స్ వంటి ప్రతికూల ప్రాంతాలకూ ఆహారం పంపిణీ విషయంలో వివక్ష చూపుతున్నారు. ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడానికి బదులు మరింత పెంచుతున్నారు. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడుతుందని ఢిల్లి సమావేశం హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్ మహిళలు, పిల్లల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు నిరాటంకంకాగా కొనసాగేందుకు తాలిబన్లు చర్యలు తీసుకోవాలనీ, ఆఫ్ఘనిస్తాన్ శాంతిభద్రతల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఐక్యరాజ్యసమితి బృందాలకు తాలిబన్లు సహకరించాలని ఢిల్లి సమావేశం విజ్ఞప్తి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ సుస్థిరతనూ, అభివృద్ధినీ కోరేవారు ఎవరైనా ఆశించేది ఇదే.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily