Friday, November 22, 2024

నేటి సంపాద‌కీయం – ఏ నిమిషానికి ఏం జ‌రుగునో.!

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ క్రికెట్‌ కెప్టెన్‌. పార్లమెంటులో మెజారిటీ కోల్పోయినా, సహజంగా క్రికెటర్‌ కావడం వల్ల ప్రతిపక్షాలు విసిరే చివరి బంతి వరకూ కాచుకుంటానని ప్రకటించారు. ఇప్పటివరకూ చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే ఆయనదే పైచేయిగా కనిపిస్తోంది. పార్లమెంటులో మెజారిటీ కోల్పోయినా ఆయన రాజీనామా చేయలేదు. పార్లమెంటు రద్దుకు సిఫార్సు చేసి ముందస్తు ఎన్నికలను ప్రకటించారు. పాకిస్తాన్‌లో రాజకీయ పరిణామాలు విస్తుగొలిపే రీతిలో సాగుతున్నాయి. ఎత్తుకు పైఎత్తు అంటే ఇదేనేమోనని పిస్తోంది. నయాపాకిస్తాన్‌ నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రజలకిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయారు. దాంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. సొంత పార్టీలోనే అసమ్మతి వర్గీయులు పెరిగారు. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షాబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌ (ఎన్‌ ), పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ పరస్పర విరుద్ధమైనవి అయినప్పటికీ ఇమ్రాన్‌ని గద్దెదింపేందుకు చేతులు కలిపాయి. అయితే, ఇమ్రాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంటు డిప్యూటీ స్పీకర్‌ తిరస్కరించడం, పార్లమెంటు రద్దుకు ఇమ్రాన్‌ చేసిన సిఫార్సును దేశాధ్యక్షుడు ఆలీ అంగీకరించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. విచిత్రమైన రీతిలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు అందరినీ ఆశ్చర్య పర్చాయి. ఇమ్రాన్‌ సిఫార్సును దేశాధ్యక్షుడు ఆమోదించడాన్ని సుప్రీంకోర్టులో ప్రతిపక్షాలు చేశాయి.

అందుకు అను గుణంగానే ఆయన మెజారిటీ కోల్పోయినా రాజీనామా చేయలేదు. పార్లమెంటు రద్దుకు ఆయనచేసిన సిఫార్సు ను దేశాధ్యక్షుడు ఆమోదిస్తూ తన ఆమోదం న్యాయ వ్యవస్థ సమీక్షకు ఉంటుందని అంటూ మెలిక పెట్టారు. అందువల్ల సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటి స్తుందో వేచి చూడాలి. పాకిస్తాన్‌లో అంతర్గత పరిస్థితు లు ఏమంత సజావుగాలేవు.దేశంలో అస్థిర పరిస్థితులను సృష్టించడానికి విదేశాలు కుట్ర చేస్తున్నాయంటూ ఇమ్రా న్‌ ఆరోపించారు. రష్యాలో తానుపర్యటించడాన్ని తప్పు పట్టిన దేశాలు రష్యాకు మద్దతు ఇస్తున్న భారత్‌ని సమర్ధి స్తున్నాయంటూ ఇమ్రాన్‌ ఆరోపించారు. భారత్‌కి వ్యతి రేకంగా ప్రకటన చేస్తే పాక్‌ ప్రజలు తన వైపుఉంటారని ఇమ్రాన్‌ భావిస్తున్నారు.అయితే, అమెరికాతో మైత్రి విషయంలో పాక్‌ అధికార గణంలోనే భిన్నాభిప్రాయా లున్నాయి. ఇమ్రాన్‌ పరోక్షంగా అమెరికాపై అస్త్రాలు సంధించినా, అమెరికాని దూరం చేసుకోవడం ఆర్మీ జనరల్‌ బజ్వాకు ఇష్టం లేదు. ఆయన బహిరంగంగానే ఈ విషయం స్పష్టం చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రస్తుతానికి పైచేయి సాధించినట్టు కనిపించినా,ప్రతిపక్షాల పిటిషన్‌ పై సుప్రీంకోర్టు తీర్పు ఎలాఉంటుందో అలాగే, ఎన్నికల కు ఇమ్రాన్‌ సిఫార్సు చేసినా, దేశంలో ప్రజలు అందుకు సిద్దంగా ఉన్నారోలేదో మరి.. ఆర్మీ జనరల్‌, సైనికాధికా రుల కనుసన్నలలో పని చేసే ప్రభుత్వ యంత్రాంగం ఇందుకు ఆమోదం తెలుపుతుందో లేదో పాక్‌లో సైనికా ధికారులదే పెత్తనం అనే విషయం జగద్విదితం.

సాఫీగా సాగే ప్రజా ప్రభుత్వాలను కూలదోసి ఆర్మీజనరల్స్‌ అధికారాన్నిచేపట్టినచరిత్ర పాకిస్తాన్‌ది. అన్నిటినిమించి ఆర్థికంగా ఎన్నో కష్టనష్టాలకు లోనవుతున్న ప్రజలు మధ్యంతర ఎన్నికలకు సిద్దంగా ఉన్నారా అన్నది అను మానమే. ఇమ్రాన్‌ పాలనలో ఆహార ధాన్యాలు, నిత్యా వసరాల ధరలు పెరిగిపోయి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రజల స్థితిగతులను పట్టించుకోకుండా ఇమ్రాన్‌ రాజకీయ సయ్యాటలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు ఇప్పటికే మిన్నుముట్టుతున్నాయి..మత పెద్దలు కూడా సైనికాధికారుల వైపే మొగ్గు చూపుతు న్నారు. అయితే, ఇంతవరకూ తన చాతుర్యంతో పరిస్థితు లను తనకు అనుకూలంగా మలుచుకుంటున్న ఇమ్రాన్‌ ఎన్నికల్లో పూర్తిమెజారిటీని సాధించి అధికారంలోకి వస్తే పాకిస్తాన్‌ చరిత్రలో అద్వితీయుడైన రాజకీయవేత్తగా నిలిచిపోతారు. రాజకీయ పార్టీల కన్నా సైనికా ధికారుల మాటకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్‌లో తిరిగి సైనిక పాలన వచ్చినా ఆశ్చర్యం లేదు. పాకిస్తాన్‌లో పరిణామాలు అనుక్షణం మారిపోతున్నాయి. దేశ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ సూచన మేరకు తాత్కాలిక ప్రధానిగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అహ్మద్‌ గుల్జార్‌ పేరును ఇమ్రాన్‌ఖాన్‌ ప్రతిపాదించారు. అయితే ఆయనను స్వతంత్రగా పని చేసుకోనిస్తారా? లేక ఒత్తిడి తెచ్చి ఆయనను నిరంతర క్షోభకు గురి చేస్తారా అన్నది కొద్ది రోజుల్లోనే తేలవచ్చు. పాకిస్తాన్‌ ప్రజాస్వామ్య ప్రభుత్వం అచ్చిరాలేదేమోననిపిస్తోంది. ఇంతవరకు ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చిన ఏ ప్రధాని ఐదేళ్ల కాలపరిమితి పూర్తయ్యేవరకూ పదవిలో కొనసాగలేదు. పాకిస్తాన్‌లో సైన్యం మాటే చెల్లుబాటు అవుతుండడం వల్ల ఏ క్షణంలో ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయో ఊహకు అందని విషయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement