Friday, November 22, 2024

నేటి సంపాదకీయం – దూసుకొస్తున్న నాలుగో ద‌శ‌

కరోనా నియంత్రణ కోసం కేంద్రం తీసుకున్న చర్యల్లో భాగంగా దేశంలో 180కోట్ల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ విజయవంతంగా పూర్తి అయిందని సంబరపడుతున్న సమయంలో మళ్ళీ కరోనా నాల్గవ దశ ప్రారంభం అవుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా పూర్తిగా తొలగిపోలేదనీ, అది మళ్ళీ విజృంభించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది. కరోనా పుట్టిన చైనాలోనే మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో 12 నగరాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. చైనాకు ప్రయాణాలను నియంత్రిస్తున్నారు. చైనాలోని వూహన్‌ నగరంలో రెండు సంవత్సరాల క్రితం పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచంలోని అన్ని దేశాలకూ వ్యాపించి కోట్లాది మందిని రోగగ్రస్తులను చేసింది. కరోనా కారణంగా అనారోగ్యమైనవారు కొందరైతే మృతుల సంఖ్య కూడాఆందోళనకలిగించే రీతిలో పెరిగింది. కరోనా పోయింది కనుక కరోనా నియంత్రణ జాగ్రత్తలు ఇక పాటించనవసరం లేదన్న ధీమాతో ఉన్న జనానికి మళ్ళీ హెచ్చరికలు చేయాల్సిన అవసరాన్ని కేంద్రం రాష్ట్రాలకు గుర్తు చేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాశారు.

మళ్ళీ ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ ప్రక్రియలు ప్రారంభించాలని సూచించారు. గతంలో వ్యాక్సిన్‌ వేయించుకోని వారిని గుర్తించి వెంటనేవారికి టీకాలు వేయాల్సిందిగా రాష్ట్రాలకు ఆయన సూచించారు. వ్యాక్సినేషన్‌ అనేది మన వ్యక్తిగత ప్రయోజనం కోసమని జనం గుర్తిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు. ఆరోగ్యాన్ని కాపాడుకోవ డానికి మన పెద్దలు ఆచరించి, ప్రబోధించిన నియమాలను పాటించకపోవడం వల్లనే కరోనా వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. శుచి శుభ్రత అనేది మన పెద్దలు ప్రవేశ పెట్టిన నియమాల్లో ముఖ్యమైనది. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు కడుక్కోవడం, బట్టలు మార్చుకోవడం వంటి నియమాలన్నీ మంచికే, ఇప్పుడు కరోనా నియంత్రణ నియమాల్లో కూడాఇవి ఉన్నాయి. చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లను వాడాలని సూచిస్తున్నారు. సబ్బుతో ముఖం, కాళ్ళూ, చేతులూ కడుక్కోవడం అనేది అనాదిగామనం పాటిస్తున్న నియమం.అలాగే, బయటకు వెళ్ళొచ్చిన దుస్తులతో భోజనం చేయరాదనీ, ఇంట్లో అందరితో కలివిడిగా తిరగరాదన్న నియమం కూడా ఉంది. దానిని కూడా ఎవరూపాటించడం లేదు. తాము కార్లలో తిరుగొస్తున్నాం కనుక, అటువంటి చాదస్తాలను పాటించక్క రలేదని వాదించేవారు ఉన్నారు.

కరోనా సోకిన వారి ద్వారా ఈ వైరస్‌ వ్యాపించకుండా ఉండటం కోసమే మాస్క్‌ ధరించాలనే నియమం పెట్టారు. మాస్క్‌లను మొక్కుబడిగా మెడలో వేల్లాడతీసుకోవడం వల్ల ఎటు వంటి ప్రయోజనం లేదు. మాస్క్‌ల ధారణ మన మేలుకేనన్న విషయం ప్రతిపౌరుడూ గుర్తెరగాలి. ఇజ్రాయెల్‌లో కొత్తరకం వేరియంట్‌, హాంకాంగ్‌, కొరియాల్లో పరిస్థితి దారుణంగా ఉండటాన్ని రాష్ట్రాలకు రాసిన లేఖల్లో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ప్రస్తావించారు. కరోనా తగ్గింది కనుక, శానిటైజర్లు అవసరం లేదన్న వాదన వితండంగానే కనిపిస్తుంది. ఎందుకంటే, చేతులు పరిశుభ్రత కోసమే శానిటైజర్లను ప్రవేశపెట్టారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే మనం తినే ఆహారంలోకి క్రిములు వెళ్ళే ప్రమాదంఉంది. పీల్చే గాలిలో ధూళి, కంటికి కనిపించని కణాలు ఉంటాయి. అవి మన శ్వాస కోసంలోకి వెళ్ళి రోగాలకు కారణం అవుతాయి. అందుకే మాస్క్‌ ధరించమని వైద్య రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాతీయ రోగ నియంత్రణ కేంద్రం, ఐసిఎంఆర్‌ సూచించిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. అయితే, మన దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత అంతగా లేదు 685 రోజుల తర్వాత 30 వేలకు దిగువన కేసుల సంఖ్య నమోదు అయింది.

కరోనా దశలు ప్రారంభమైన తర్వాత ఇంతవరకూ మన దేశంలో నాలుగు కోట్ల30 లక్షల మందికి పైగా కరోనా సోకగా, ఐదు లక్షల 16వేలకు పైగా మరణాలు నమోదు అయ్యాయి. అయితే, కరోనా మరణాలన్నీ అధికారికంగా నమోదు కావడం లేదనీ, కొన్ని రాష్ట్రాల్లో టెస్ట్‌లు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి, మత, సామాజిక పరమైన ఉత్సవాలకు కరోనావల్ల అవరోధం కలగరాదన్న ఉద్దేశ్యంతో కొందరు కరోనా కేసులనూ, మరణాలనూ దాచి పెడుతున్నారన్నవార్తలు కూడావస్తున్నాయి. రోగాన్ని దాచి పెడితే చెంగున నిప్పుకట్టుకున్నట్టు అవుతుందన్నది పెద్దల హిత వాక్యం. దీనిని పాటిస్తే చాలా రోగాలను ఆదిలోనే ట్రేస్‌ చేసి చికిత్స పొందవచ్చునని వైద్యులు చెబుతున్నారు. కరోనా నాల్గవదశ ప్రారంభంలోనే ఉంది కనుక, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అలా అనినిర్లక్ష్యం ఎంత మాత్రం పనికిరాదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement