వేసవి మొదలైతే కరెంట్ కష్టాలు మొదలవుతాయి. విద్యుత్ ఉత్పత్తి మామూలు కన్నా17 శాతం తగ్గిపోవడం వల్ల దేశ రాజధాని ఢిల్లిలో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ కోతలకు ఇతర రాష్ట్రాలు ఎప్పుడో అలవాటు పడిపోయాయి. అయితే, దేశ రాజధానిలో కరెంట్ కోతల వల్ల తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి. కనుక ఈ విషయమై ఢిల్లి ప్రభుత్వమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఢిల్లిలో విద్యుత్ కోతల వల్ల కేంద్ర ప్రభుత్వ కార్య కలాపాలకు అవరోధం కలుగుతుంది. విదేశీ దౌత్య కార్యాలయాలకు విద్యుత్ కోత విధిస్తే పరువు పోతుంది. దేశంలో బొగ్గునిల్వలు ఉన్నప్పటికీ, వాటిని థర్మల్ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు లేకపోవడం వల్ల కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. దేశంలో వినియోగించే విద్యుత్‌లో 70 శాతం ఇప్పటికీ థర్మల్ కేంద్రాలపైనే ఆధారపడి ఉండటం వల్ల బొగ్గు సరఫరా తగ్గితే విద్యుత్ కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి. ప్రస్తుతపరిస్థితి కారణం అది. అయితే, ఈ సమస్యను రాజకీయ ప్రయోజనం కోసం వినియోగించుకునేందుకు వివిధ పార్టీలు ప్రయత్నించడం దురదృష్టకరం. విద్యుత్ ఒప్పందాలలో చాలామటుకు నిఖార్సైనవే కానీ, కొన్ని ఒప్పందాలపై అవినీతి ఆరోపణలు రావడంతో పూర్వపు యూపీఏ ప్రభుత్వంలోనే ఈ సమస్య తెరమీదికి వచ్చింది. అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు జరిపించి, దోషులుగా నిగ్గు తేలినవారిపై చర్యలు తీసుకోవాలి కానీ, ఏకంగా మొత్తం ఒప్పందాలను రద్దు చేయడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కొరత, కోత ఇప్పుడు ప్రధాన సమస్యలయ్యాయి, దేశంలో 13 రాష్ట్రాలు పైగా విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయని ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షం పేర్కొంటోంది. విద్యుత్ కొరత లేని రాష్ట్రం లేదు. వేసవిలో విద్యుత్ కొరత, కోత అబ్బురం కాదు. కాకపోతే ఈ అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ పార్టీలు చేసుకుంటున్న ఆరోపణలు కర్ణ కఠోరంగా ఉంటున్నాయి. బొగ్గు సరఫరా లేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచి పోయిందని తెలియగానే, ఆగమేఘాలపై బొగ్గును సరఫరా చేసేందుకు రైల్వే శాఖ42 ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేసింది. దాంతో చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో రైళ్ళ పునరుద్దరణ కోసం ఆందోళనలు మొదలయ్యాయి. విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గు సరఫరా చేసిన తర్వాత రైళ్ళను పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. విద్యుత్ వినియోగంలో దుబారా, చౌర్యం వంటివి అరికడితే 20 శాతం పైగా విద్యుత్‌ని ఆదా చేయవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. విద్యుత్‌నీ, మంచినీటినీ పొదుపుగా వాడుకోవాలని ఎవరైనా సలహా ఇస్తే చాదస్తపు మాటలు మాట్లాడొద్దని విసుక్కొనేవారు మన మధ్యనే ఉంటారు. ఆడంబరంగా, పటాటోపంగా జరిగే ఉత్సవాలు, శుభకార్యాల సంగతి అలా ఉంచితే ఇళ్ళల్లో రోజూ వాడకంలోనే విద్యుత్ చాలా ఎక్కువగా వృధా అవుతోంది. జనం మసలని గదుల్లో కరెంట్ వృధా కావడం మన ఇళ్ళల్లో జరగుతున్నా మనం గుర్తించం.
విద్యుత్‌ను ఐశ్వర్యంగా భావించేవారు లైటు ఆర్ప కూడదన్న నమ్మకాలను పాటిస్తూ ఉంటారు. అయితే, పెద్ద ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో విద్యుత్ వృధా చాలా ఎక్కువగా ఉంటోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పరిధిలో 165 విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు 10 శాతం కన్నా తక్కువ ఉన్నాయని ఆ ప్రాథికార సంస్థ అధికారులు తెలిపారు. విద్యుత్ కొరత, కోత మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగాఉంది. ఇందుకు కారణం థర్మల్ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని పర్యావరణ హితైషులు పదే పదే హెచ్చరించడమే కారణం. భూతాపం పై పారిస్‌లో జరిగిన ఒప్పందం ప్రకారం ఉద్గారాలను తగ్గించేందుకు అంగీకరించిన అమెరికా సహా పలు సంపన్నదేశాలు విద్యుత్ కేంద్రాలు మూత పడితే లక్షలాది మంది నిరుద్యోగులవుతారనీ, అది సాధ్యమయ్యే పని కాదని స్పష్టం చేశాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇదే విషయం స్పష్టం చేసినప్పుడు పర్యావరణ వేత్తలనుంచి పెద్ద నిరసన బయలుదేరింది. ఇందుకు పరిష్కారం సంప్రదాయేతర ఇంధన వనరులను పెంచుకోవడమే. అయితే, జల, పవన, వాయు విద్యుత్ కేంద్రాలను అధిక సంఖ్యలో నెలకొల్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి థర్మల్ కేంద్రాలదే హవా కొనసాగే అవకాశం ఉంది. థర్మల్ కేంద్రాలకు బొగ్గు సకాలంలో చేరేందుకు చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను కేంద్రం ఆదేశించిన నేపథ్యంలోనే బొగ్గు రవాణా కోసం ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయిం చినట్టు స్పష్టం అవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..