కేంద్రంలో మళ్లి పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న కమలదళానికి తొలి పరీక్ష గురువారంనాడే ఎదురు కానున్నది. కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో గెలిచి తీరాల్సిన సమయంలో జరుగుతున్న ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్‌ను పెంచాయి. ఇప్పుడు దేశమంతా ఈ ఎన్నికల వైపే చూస్తున్నది. యూపీలో తొలివిడత పోలింగ్‌లో భాగంగా గురువారం ఉదయం పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో, 58 స్థానాలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. దాదాపు 623 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీ పడుతున్నారు. బీజేపీ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపనున్న ఈ ఎన్నికలు ఆ పార్టీకి అగ్నిపరీక్షగానే నిలువనున్నాయి. ముఖ్యంగా.. పశ్చిమ యూపీ ప్రాంతంలో జాట్‌లు, ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జోరుగా ఉద్యమం సాగింది ఈ ప్రాంతంలోనే కావడంతో కమలనాథులలో టెన్షన్ పెరుగుతున్నది. సుదీర్ఘకాలం ఆందోళన చేసిన రైతులలో ఎక్కువ మంది జాట్‌లే. యూపీ ఎన్నికలు ముంచుకు రావడంతోనే ప్రధాని మోడీ సాగు చట్టాలను రద్దు చేసి రైతులకు క్షమాపణలు చెప్పారు. అయితే… అన్నదా తలు ఆయనను ఎంతవరకు మన్నించారనేది ఈ ఎన్ని కలతోనే తేలిపోతుంది. రైతులను ప్రసన్నం చేసుకోవడానికి మోడీతోపాటు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా తన వంతు ప్రయత్నాలు చేశారు. కేసులు ఎత్తి వేయడం, బకాయిల చెల్లింపు వంటి వరాలు కూడా ప్రకటించారు.
అంతేకాదు.. ఓటర్లను ఆకట్టుకోవడానికి తన ప్రభుత్వం సాధించిన ఘన విజయాలను ఏకరవు పెట్టారు. తన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించిందని ఘనంగా చెప్పుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు తన హయాంలోనే మెరుగుపడ్డాయని తనకు తానే కితాబు ఇచ్చుకున్నారు. అయితే… పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు మజ్లిస్ ఇత్తే హాదుల్ ముస్లీమీన్ అధినేత అసదుద్దీన్ ఓవైస్ కారుపై జరిపిన కాల్పుల ఘటన యోగీ గొప్పల గాలి తీసేసింది. దీనికి తోడు తమ డిమాండ్లు నెరవేర్చని బీజేపీని ఓడించాలని సంయుక్త కిసాన్ మోర్చా రైతులకు పిలుపు ఇచ్చిం ది. ఈ పిలుపునకు 57 రైతు సంఘాలు మద్దతు పలికాయి. జాట్‌లలో పేరుకుపోయిన బీజేపీ వ్యతిరేకతను సొమ్ము చేసుకునేందుకు ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ అగ్రనాయకుడు అఖిలేష్ యాదవ్ శరవేగంగా పావులు కదిపారు. జాట్‌లలో మంచి పలుకుబడికలిగిన రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) అధినేత జయంత్ చౌదరితో జట్టుకట్టారు. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు జయంత్ చౌదరి స్వయానా మనవడు. కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కుమారుడు. తాత, తండ్రి హయాం నుంచీ ఈ కుటుంబానికి రైతులతో అనుబంధం ఎక్కువే. వీరిద్దరూ జాతీయస్థాయిలో రైతు నేతలుగా మన్ననలు పొందిన వారే. రైతు ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన ఘటనతో ఇక్కడి రైతాంగం బీజేపీపై నిప్పులు చెరుగుతున్నది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ ఆందోళన చేస్తున్న అన్నదాతల మీదికి తన కారును ఉరికించడంతో దాదాపు ఎనిమిది మంది రైతులు మరణించిన ఘటన వారిని బీజేపీపై కత్తిగట్టేలా చేసింది. ఎలాగైనా బీజేపీకి బుద్ధి చెబుతామని వారు ప్రతినపూనారు. ఈ పరిస్థితులన్నీ తనకు సానుకూలంగా మారుతాయని అఖిలేష్ యాదవ్ గంపెడాశతో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టుతుందన్న సెంటిమెంట్ యూపీ నేతల్లో బలంగా ఉన్నది.
అందుకే అన్ని పార్టీలు ఇక్కడి స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. తమ తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించాయి. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, యోగీ ఆదిత్యనాథ్, ఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ అధినేతలు కాలికిబలపం కట్టుకొని ప్రచారం చేశారు. బీఎస్‌పీ అధి నేత్రి మాయావతి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితర అతిరథ, మహారథులు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. దీంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ అనివార్యంగా మారింది. మరి ‘చాయ్ వాలా, గాయ్ వాలా’ నినాదం బీజేపీకి ఎంత మేరకు మేలు చేస్తుందో చూడాల్సిందే. 2017లో జరిగిన అసెంబ్లి ఎన్నికలలో ఇక్కడి 58 నియోజకవర్గాలలో 53 స్థానా లను బీజేపీయే కైవసం చేసుకున్నది. ఎస్‌పీ, బీఎస్‌పీ చెరి రెండు స్థానాల్లో గెలు పొందగా, రాష్ట్రీయ లోక్‌దళ్ ఒక స్థానంలో విజయం సాధించింది. కరోనా నియంత్రణతో సహో ఎన్నో విజ యాలు సాధించామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నా… సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ లభించక అల్లాడిన నాటి రోజులు ఇంకా గుర్తే ఉన్నాయని కొందరు ఓటర్లు అంటున్నారు. అయితే, రాష్ట్రంలో సుస్థిర పాలన అందించగలిగేది బీజేపీయేనని ఓటర్లను నమ్మించడంలో కమలనాథులు సక్సెస్ అయినట్లే కనిపిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..