బీజింగ్‌లో ఫిబ్రవరిలో జరిగే వింటర్ ఒలింపిక్‌ను తమ దౌత్యవేత్తలు బహిష్కరిస్తారంటూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ ప్రకటించడంతో చైనా అగ్గి మీద గుగ్గిలం అయింది. ఆస్ట్రేలియా క్రీడాకారులు పాల్గొననున్నారుగా, దౌత్యవేత్తలు పాల్గొనకపోతే ఏమి అంటూ చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ వ్యాఖ్యానించారు. ఆ మాటనిజమే కానీ, నైతిక విలువలకు అది నిలబడదు. చైనాలోని గ్జిన్ జియాంగ్ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘనకు నిరసనగా ఈ ఒలింపిక్స్‌ని బహిష్కరించాలని ఇప్పటికే అమెరికా, కెనడా తదితర దేశాలు నిర్ణయించాయి. ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్ క్రీడలు జరిగి తీరుతాయని చైనా విదేశాంగ ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమెరికా వైఖరిని చైనా ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. రాజకీయాల్లో క్రీడా స్ఫూర్తి ఉండాలన్న సిద్దాంతాన్ని పక్కన పెట్టి అమెరికా క్రీడల్లో రాజకీయాలను చొప్పిస్తున్నదంటూ చైనా విదేశాంగ ప్రతినిధి విమర్శిం చారు. ఆయన వాదన లాజిక్‌గా కనిపిస్తున్నా, చైనాలో జరుగుతున్నదంతా సవ్యంగా, సజావుగా ఉందని చెప్పలేం. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. రాజకీయ నాయకుల నిర్బంధాలు, వారిపై దాడులు సర్వసాధారణం.
సమాజంలో మేథావులు,రచయితల నిర్బంధాలు కూడా ఈ మధ్య కాలంలో నిత్యకృత్యాలయ్యాయి. ఇందుకు ఉదాహరణ చైనాలో ప్రజాస్వామ్య అనుకూల వాది ,సుప్రసిద్ధ రచయిత యాంగ్ హెన్‌జుయెంగ్‌ని రెండేళ్ళనుంచి నిర్బంధంలో కొనసాగించడమే.ఆయన రహస్య గూఢ చర్య కార్యకలాపాలు సాగిస్తున్నాడంటూ నిర్బంధంలో కొనసాగిస్తున్నారు. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమకారులపై చైనా సేనలు జరుపుతున్న దాడులు అమానుషమని ప్రపంచ దేశాలు ఇప్పటికే దుమ్మెత్తి పోస్తున్నాయి. తమ దేశంలో మత పరమైన వైవిధ్యాలులేని చైనా నాయకులు చెప్పుకుంటూ ఉంటారు. కాని గ్జిన్ జియాంగ్ ప్రాంతంలో ముస్లింలు అధిక సంఖ్యలోఉన్నారు.వీరిపై మత పరమైన దాడులు జరుగుతు న్నాయని మానవహక్కుల సంఘాల వారు ఆందోళన సాగిస్తున్నారు. అంతేకాకుండా, ఇక్కడి ముస్లింలను కుటుంబ నియంత్రణ పాటించేట్టు ఒత్తిడి తేవడంతో స్థానికులలో ఆందోళన ప్రారంభమైంది. నిజానికి ఈ ప్రాంతం స్వయం పాలిత ప్రాంతమైనప్పటికీ, ఫెడరల్ ప్రభుత్వం అదుపాజ్ఞలలోనే ఇక్కడ పాలనా వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంవారి పట్ల వివక్ష పై చైనాను అమెరికా, దాని మిత్ర దేశాలు చాలాకాలంగా హెచ్చరి స్తున్నాయి. ఆస్ట్రేలియాకి చెందిన ఇద్దరు పౌరులను చైనాలో అక్రమంగా నిర్బంధించడాన్ని ఆస్ట్రేలియా తీవ్రంగా నిరసిస్తోంది. అమెరికా కుతంత్రం వల్లనే ఆస్ట్రేలియా, కెనడాలు బీజింగ్ ఒలింపిక్‌ని బహిష్కరించాలని నిర్ణయించి ఉంటాయని చైనా అధికార ప్రతినిధి అన్నారు.
చైనాలోని గ్జిన్ జియాంగ్ ప్రాంతంలో మహిళలపై జరుగుతున్న దాడులను అమెరికా, కెనడా విదేశాంగ శాఖ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు.చైనాకు నిరసన తెలియజేయడానికి ఇదే సరైన అవకాశమని ఈ రెండు దేశాలు భావిస్తున్నాయి. అయితే,సరైన కారణం చూపకుండా చైనాపై హక్కులఉల్లంఘన ఆరోపణలు చేయడం సాధ్యం కాదు.ఇటీవల చైనాకి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షుయి అదృశ్యమైంది.ఆమె కోసం చైనా ప్రభుత్వం గాలింపు జరిపించడంలో నిర్లిప్తంగా వ్యవహరించిందని హక్కుల సంఘాల ఆరోపణ.దీనిపై ఇతర దేశాల నుంచి వచ్చిన విమర్శలను లెక్క చేయబోమని చైనా స్పష్టం చేసింది.వింటర్ ఒలింపిక్‌ను బహిష్కరించడానికి దీనిని పాశ్చాత్య దేశాలు ఒక కారణంగా చూపుతున్నాయి.అయితే, చైనాదూకుడుకు కళ్ళెం వేయాలన్న ఉద్దేశ్యం పాశ్చాత్య దేశాలకు ఉండి ఉండవచ్చు. ఏమైనా చైనా అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలకు స్వదేశంలోనే కాక,ప్రపంచ దేశాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజి లాండ్ కూడా బీజింగ్ ఒలింపిక్‌కు తమ అధికారులను పంపడం లేదని ప్రకటించింది. అయితే, కరోనా కారణంగా నే తమ అధికారులను పంపడం లేదని స్పష్టం చేసింది. బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్ క్రీడోత్సవాలు ఏకపక్షంగానే జరిగే అవకాశాలు ఎక్కువ గా కనిపిస్తున్నాయి.