కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి చింతన్ శిబిర్‌ని ఈనెల 13,14,15 తేదీల్లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించనున్న సందర్భంగా అజెండాను రూపొందించేందుకు సోమవారం జరిగిన పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక వేదిక అయిన వర్కింగ్ కమిటీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోనియా వర్కింగ్ కమిటీ సమావేశంలో చేసిన ప్రసంగంలో ఆత్మవిమర్శ అవసరమే కానీ,ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయరాదని అనడంలో ముఖ్యోద్దేశ్యం ఏమిటో అందరికీ అర్ధమయ్యే ఉంటుంది. తన కుమారుడు రాహుల్ గాంధీపై సీనియర్ నాయకులు ఎక్కుపెడుతున్న విమర్శలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె ఒక తల్లిగా మదన పడుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్‌లను నిర్వహించినప్పుడు పార్టీలో లోపాల గురించి సీనియర్ నాయకులు చాలా ఘాటైన విమర్శలు చేశారు.అదే సందర్భంలో నిర్మాణా త్మకమైన సూచనలూ చేశారు. ఆ సూచనల్లో కనీసం ఒక్కటైనా అమలు జరిగి ఉంటే పార్టీ కొంతైనా పుంజుకుని ఉండేది. ఒక మనిషికి ఒకే పదవి అనే నిర్ణయాన్ని ఇంత వరకూ పార్టీ అమలు జేయలేకపోయింది.దానికి కార ణం గాంధీ కుటుంబంపై పార్టీ ఆంధారపడటమే.
అప్ప ట్లోపార్టీ కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లోనూ అధి కారంలో ఉండేది. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది.ఆ రెండింటిలో ఒకటైన రాజస్థాన్‌లో ఈ సారి చింతన్ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రాజస్థాన్‌లో పార్టీ పరిస్థితి ఏమంత సవ్యంగా లేదు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కీ, యువనాయకుడు సచిన్ పైలట్‌కీ సరిపడకపోవడం వల్ల పార్టీ వ్యవహారాలు తరచూ రచ్చకెక్కుతున్నాయి. రాజస్థాన్‌లోనే కాదు, పార్టీ అధి కారంలో ఉన్న మరో రాష్ట్రమైన చత్తీస్‌గఢ్‌లోనూ అదే పరిస్థితి. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీక రించాలన్నది సోనియా అభిమతం.పార్టీలో సీనియర్ నాయకులు,ఇతరులు రాహుల్ పార్టీని నడిపించడంలో విఫలమయ్యారంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తుండటంతో ఆ బాధ్యతలను స్వీకరించేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. ఆయనపై విమర్శల జోరు తగ్గించ మని సోనియా చెప్పకనే చెప్పినట్టయింది.రాహుల్ గాంధీ పార్టీ పునర్ వైభవం కోసం యాత్రలు ప్రారం భించారు.తెలంగాణలోని వరంగల్ రైతు సంఘర్ష యాత్ర పేరిట జరిపిన సభలో ఆయన వచ్చే ఎన్నికలకు సంసిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కనుక, కాంగ్రెస్‌ను గెలిపిం చుకోవాలని ఆయన పార్టీ కేడర్‌ని ఉద్దేశించి పిలుపు ఇచ్చారు.వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొ నేందుకు పొత్తు రాజకీయాలు ఒక వైపు నడు స్తుం డగా, పార్టీకి దూరమైన వారందరినీ కలుపుకుని పోవాలని సోనియా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వర్కిం గ్ కమిటీ సమావేశం సందర్భంగా ఆమె తన ప్రసంగం లో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు.పార్టీ ద్వారా గతంలో పదవులు అనుభవించిన వారంతా పార్టీకి పునర్ వైభవాన్ని తేవడానికి ముందుకు రావాలని ఆమె పిలుపు ఇచ్చారు.
కాంగ్రెస్ పటిష్టత, స్థితి స్థాపకతను ప్రదర్శించడానికి చింతన్ శిబిర్ దోహదం చేస్తుందని ఆమె ఆకాంక్షిస్తున్నారు. పార్టీనాయకులు బయట మాట్లాడకుండా పార్టీ వేదికలపైనే తమ అభిప్రా యాలను వెలిబుచ్చాలని సూచించిన ఆమె పార్టీ వేదిక లపై ఆత్మవిమర్శ చేసుకునేసందర్భంలో ఎదుటి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొద్దని సూచించడాన్ని బట్టి పార్టీలోని రుగ్మతలను పైపైనే ప్రస్తావించాలనీ, లోతుగా ప్రస్తావించరాదని చెప్పడంగా పార్టీ నాయకులు భావిస్తే తప్పు పట్టలేం. కాంగ్రెస్‌లోప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య నాయకత్వ సమస్య.రాహుల్ గాంధీ తప్ప మరొకరు పార్టీ నాయకత్వాన్ని చేపట్టరాదని పార్టీలో ఒక వర్గం కోరుతుండగా, కొత్త నాయకత్వం రావాలన్న డిమాండ్ తరచూ వస్తోంది.పార్టీ సీనియర్ నాయకులు 23 మంది సోనియాకు గతంలో రాసిన లేఖలో నేరుగా ఈ అంశాన్ని పేర్కొనకపోయినా, ఆ లేఖ సారాంశం ఇదే. రాహుల్ గాంధీని పార్టీ సీనియర్ నాయకులు వ్యతి రేకిస్తున్నారన్నది బహిరంగ రహస్యం.అయితే,ఆ విష యాన్ని గుట్టుగా ఉంచాలన్నదే సోనియా అభిమతం. పార్టీని నడిపించేందుకు నవసంకల్పంతో నయా పంథా లో ముందుకు సాగాలని ఆమె వర్కింగ్ కమిటీ సమావేశంలో అభిప్రాయ పడినట్టు వార్తలు వచ్చాయి.ఒక కుటుంబానికి ఒక పదవి అనే ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో గాంధీ కుటుంబానికి మిన హాయింపు ఇస్తారా లేక, సోనియా పార్టీ పదవులనుంచి పూర్తిగా తప్పుకుని రాహుల్‌కే అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలనుకుంటున్నారా అన్నది చింతన్ శిబిరం లోనే తేలవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి నినాదాలు ఇంతకు ముందు కూడావచ్చాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..