Friday, November 22, 2024

నేటి సంపాద‌కీయం – ఆర్ధిక చ‌క్ర‌బంధంలో ర‌ష్యా..

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్నది అన్యాయ యుద్ధమని యావత్‌ ప్రపంచంతీవ్ర నిరసన తెలియజేస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ని ఏకాకిగా చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ పక్కా పథకాన్ని అమలు జేస్తున్నారు. అయితే, చైనా మాత్రం రష్యాకు ముఖ్యంగా పుతిన్‌కి అండగా ఉన్నామంటూ ప్రకటన చేసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధం కన్నా సంప్రదింపులు, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే, ఉక్రెయిన్‌ ఆయుధాలను విసర్జిస్తేనే చర్చలు సాధ్యమని పుతిన్‌ స్పష్టం చేశారు. అయితే, ఇక్కడ ఆయుధాలను ఎవరు ముందు ఎక్కుపెట్టారో వారే విసర్జించాల్సి ఉంటుంది. ఆత్మరక్షణ కోసం ఆయుధాలను చేపట్టిన ఉక్రెయిన్‌ సైన్యాన్ని ఆయుధాలను విసర్జించాలని పుతిన్‌ షరతు పెట్టడం అధర్మమే కాకుండా, నీతి బాహ్యమని ప్రపంచ దేశాలు స్పష్టం చేస్తున్నాయి. పుతిన్‌ వ్యతిరేక ప్రదర్శనలు, నినాదాలతో రష్యన్‌ నగరాలు హోరెత్తుతున్నాయి. యుద్ధాన్ని ఎవరూ కోరుకోవడం లేదు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చండి అంటూ ప్లకార్డులు పుచ్చుకుని ప్రదర్శకులు నినాదాలు చేస్తున్నారు. పుతిన్‌ ఎవరి మాటనూ లెక్క చేయని రీతిలో వ్యవహరిస్తున్నా రని రష్యాలో సీనియర్‌ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుతిన్‌ సాగిస్తున్న ఏక పక్ష యుద్ధంలో రష్యన్‌ సైనికులు సమిధలు అవుతున్నారు. ఇప్పటి వరకూ వెయ్యిమంది రష్యన్‌ సైనికులు తమ సైనికుల దాడిలో మరణించినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జలెన్‌స్కీ ప్రకటించారు.

రష్యాపై అమెరికా గతంలో విధించిన ఆంక్షల ప్రభావం వాణిజ్య, పారిశ్రామికరంగాలపై తీవ్రంగా ఉంది. ఇప్పుడు కొత్తగా విధించిన ఆంక్షల వల్ల పెద్ద సంస్థలు సైతం ఆర్థికంగా కుదేలయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రష్యాలో అతి పెద్ద బ్యాంకులైన స్పెర్‌, వీటీబీ బ్యాంకులలావాదేవీలపై ఆంక్షలు విధించారు. రష్యాలోని 80 శాతం బ్యాంకుల లావాదేవీలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా, డాలర్లు, యూరోలతో రష్యన్‌ పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు జరిపే లావాదేవీలకు ఈ ఆంక్షల వల్ల పెనువిఘాతం కలుగుతుందని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. రష్యాకు పూర్వపు వైభవాన్ని తేవడమే తన లక్ష్యమంటూ పదే పదే ప్రకటించే పుతిన్‌ ఈ దారుణఆర్థిక పరిస్థితికి ఏం సమాధానం చెబుతారని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఉక్రెయిన్‌ని లొంగదీసుకోవడానికి ఇంతటి ఘోరానికి పాల్పడటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సహాపలు నగరాల్లో భవనాలు, కట్టడాలు దెబ్బతిన్న మాటవాస్తవమే. అయితే, ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్‌ కన్నా రష్యాకు ఎక్కువ నష్టమని యూరోపియన్‌ యూనియన్‌ ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. పుతిన్‌ కోపం అంతా యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) మీదనే అయితే, ఆయన లక్ష్యం దెబ్బతిన్నట్టేనని, పుతిన్‌ని ఎవరూ నమ్మడం లేదనీ, రష్యాకు పూర్వ వైభవం మాటేమోగానీ, ప్రపంచ దేశాల్లో ఉన్న పేరు, ప్రతిష్ఠలను పుతిన్‌ చెడగొడుతున్నారని విశ్లేషకులు ఘాటుగా విమర్శిస్తున్నారు. క్రిమియాపై, జార్జియాపై దాడుల సమయంలో రష్యాపై విధించిన ఆంక్షల కన్నా ఇప్పుడు విధించిన ఆంక్షలు చాలా కఠినమైనవని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.

స్పెర్‌, వీటీబీ బ్యాంకులతో లావాదేవీలను బ్రిటన్‌ స్తంభింపజేసింది. ఇవే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 90పైగా ఆర్థిక సహాయ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలతో కూడారష్యా లావేదేవీలపై ఆంక్షలను విధించారు. పుతిన్ 63వేల కోట్ల డాలర్లనిధులను సిద్ధం చేసుకుని యుద్ధం ప్రారంభించిన ప్పటికీ, ఆంక్షల కారణంగా ఈ నిధుల్లో ఎన్ని చెల్లుబాటు అవుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. రష్యాలో అతిపెద్ద గ్యాస్‌ సంస్థ అయిన గ్యాజ్‌ ప్రోమ్‌ పశ్చిమ దేశాల బ్యాంకుల నుంచి మూలధనం సేకరించకుండా ఆంక్షలు విధించారు. అలాగే, చమురు, సహజవాయువు అమ్మకాల ద్వారా రష్యాకి రావల్సిన డాలర్ల సొమ్ముపై కూడా ఆంక్షలు విధించారు. రష్యాను రాజకీయంగానే కాకుండా, ఆర్థికంగా ఏకాకిని చేసేందుకు అమెరికా పటిష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ సంగతి తెలియడం వల్లనే పుతిన్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ టెలిఫోన్‌ సంభాషణ జరిపారు, తమ ఇరు దేశాల మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలకు ఈ ఆంక్షలు అడ్డురాకుండా చూసుకోవడం కోసమే జిన్‌పింగ్‌ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కాగా, యూరోపియన్‌ యూనియన్‌ కూడా రష్యాపై కొత్తగా ఆంక్షలకు సిద్ధమవుతున్నట్టు ఆ సంస్థ అధ్యక్షురాలు ఉర్సులా లాన్‌డె తెలియజేశారు. రష్యాకు సహకరిస్తున్న దేశాలపై ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. యూరోపియన్‌ యూనియన్‌లో సభ్యత్వంగల దేశాలన్నీ ఒకే మాటపై ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఈయూ దేశాలకు రష్యా ఎరవేస్తున్నట్టు భోగొట్టా.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement