Tuesday, November 26, 2024

నేటి సంపాదకీయం – త‌ప్పు ఒప్పుకుంటూనే..

ఉక్రెయిన్‌ పై దాడి వల్ల తమ దేశం విపరీతంగా నష్ట పోయిందని రష్యా గ్రహించింది. తమ దేశానికి సైనికంగా అపార నష్టం కలిగిన మాట నిజమేనని క్రెవ్లిున్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ అంగీకరించడంతో ఇంత కాలం రష్యాచేస్తున్న ప్రకటనలన్నీ బూటకాలేనని తేలి పోయింది. యుద్ధంలో తమ అంచనాలు తల కిందులనాయని కూడా ఆయన అంగీకరించారు. ఓటమి పాలైన దేశం ఎప్పుడూ చివరలో చెప్పే మాటే ఇది. పోగాలము దాపురించడం వల్లనే రష్యాకి ఎంత మంది ఎన్నివిధాల నచ్చజెప్పినా వినలేదు. ఆస్తి నష్టాన్ని తిరిగి పూడ్చుకోవచ్చు, ప్రాణనష్టాన్ని పూడ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. యుద్ధంలో విజయదుందుభి మోగిస్తేనే, సైన్యంలో చేరడానికి యువతరం ముందుకు వస్తుంది. ప్రాణాలు పోవడం ఖాయమని అంటే యువకులు ఎవరూముందుకు రారు. సైన్యంలో చేరేందుకు ఉత్సాహం చూపే యువతరంలో సాహ సోపేతులు, మాతృదేశం కోసం అంకిత భావంతోపోరాడే వారుంటారు. అయితే, వారి త్యాగాలు వృధా అవుతుంటే కొత్త వారికి ఆసక్తి, ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది? నిప్పులో దూకమన్నా దూకే క్రమశిక్షణ, నిబద్ధతగల సైనికులను ఎలా ఉపయోగించుకోవాలో అధికారంలోఉన్న నాయకగణానికి తెలియాలి. చాలాదేశాల్లో పోరాటాలు, లేదా యుద్ధాలు విజయవంతం అయ్యాయంటే అక్కడి సైనికుల్లో క్రమశిక్షణ, అంకితభావాలకు తోడు జాతీయ భావం కూడాఉండటం వల్లనే.

రష్యా సైనికుల విషయం తీసుకుంటే, ఈ యుద్ధంలో పాల్గొ నేందుకు చాలామంది విముఖత చూపారన్న వార్తలు అసత్యం కాదని ఇప్పుడు స్పష్టం అవుతోంది. ఆయుధపరంగా, సైనికపరంగా రష్యా ప్రపంచంలోనే బలోపేతమైన శక్తిగా పేరొందింది. ఉక్రెయిన్‌ యుద్దంలో రష్యా ఎదురుదెబ్బలు తినడానికి కారణం యుద్ధం చేసే సైనికుల్లో నిర్లిప్తత వ్యాపించడమే కారణం. ఉక్రెయిన్‌ ఒకప్పుడు సోవియట్‌ రష్యా అంతర్భాగం కావడం వల్ల రష్యన్‌ సైనికుల్లో చాలా మందికి ఉక్రెయిన్‌ పౌరుల పట్ల సోదర భావం, స్నేహ సంబంధాలు ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ పుతిన్‌ ఆదేశాలను తుచ తప్పకుండా పాటిస్తూ రష్యన్‌ సైనికులు ప్రాణాలకు తెగించి యుద్ధంలో పాల్గొన్నారు. ఈ యుద్దంలో 18 వేల మందిపైగా రష్యన్‌ సైనికులు మరణించినట్టు వందలాది ట్యాంకులు, క్షిపణులు ధ్వంస మైనట్టు ఇంతకుముందే వార్తలు వచ్చాయి. మేజర్‌, జనరల్‌ స్థాయి ఉన్నతాధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంత నష్టం జరిగినా పుతిన్‌ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ, తమవైపు వాటిల్లిన నష్టాన్ని తక్కువ చేసి చూపుతూ ప్రకటనలు చేశారు. కొంతమంది సైనికాధికారులు పుతిన్‌కి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. ఉక్రెయిన్‌ని నిస్సైనీకరణ చేయాలన్న లక్ష్యంతో యుద్దానికి దిగిన రష్యా తొలి రోజుల్లోనే ఎదురు దెబ్బలు తింది. అయితే, మెహర్బాణీ కోసం తమ సేనలు దూసుకుని వెళ్తున్నట్టు, పెక్కు ప్రాంతాలు తమ అధీనంలోకి వచ్చినట్టు ప్రకటించి యావత్‌ ప్రపంచాన్నీ మభ్యపెట్టింది. ఈ యుద్ధం వల్ల రష్యా లక్షల కోట్ల రూబుల్స్‌ను కూడా నష్టపోయింది. ఉక్రెయిన్‌ నగరాలను మరుభూములుగా మార్చిన రష్యన్‌ సైనికులు ఉక్రెయిన్‌లనుంచే కాకుండా స్వదేశీయుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు.

ఈ యుద్ధంలో కన్నా అమెరికా సహాపలు ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షల వల్ల రష్యా ఎక్కువ నష్టపోతున్నది. రష్యాను ఏకాకిగా చేసేందుకు అమెరికా పన్నిన వ్యూహం ఫలిస్తోంది. ఇంతవరకూ తటస్థంగా ఉన్న మన దేశం కూడా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్స్‌ సమీపంలోని బుచా పట్టణంలో రష్యన్‌ సైనికులు జరిపిన ఊచకోతలను తీవ్రంగా ఖండించింది. రష్యాకు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణం చైనా. అమెరికాపై ప్రతీకారాన్ని తీర్చుకోవడం కోసం చైనా రష్యాను ఉసిగొల్పింది. యుద్ధంలోకి దిగే దాకా రష్యా వెంట ఉండి ఆ తర్వాత చల్లగా జారుకుంది. మనదేశం మొదటి నుంచి తటస్థ వైఖరిని అనుసరించడం వల్ల అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకోగా, చైనా రష్యాను ముందు ఉసిగొల్పి తర్వాత హింస వద్దంటూ సన్నాయి నొక్కులు నొక్కడం వల్ల ప్రపంచంలో ఏ ఒక్కదేశమూ చైనాను నమ్మడం లేదు. చైనాపోకడను గమనించడం వల్లనే అమెరికా ముందుగా సందేహించినా, తర్వాత ఉక్రెయిన్‌కి భారీగా నిధులనూ, ఆయుధాలనూ సరఫరా చేసింది. దీనిని ఉద్దేశించే మూడో ప్రపంచ యుద్దం వస్తోందంటూ పుతిన్‌ హెచ్చరికలు చేశారు. చైనాని నమ్మి రష్యా నష్టపోయినట్టే, అమెరికాని నమ్మి ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోయింది. ఈ యుద్ధం తమకు తీరని విషాదాన్ని మిగిల్చిందని ఒకవైపు రష్యా అధికారి ప్రతినిధి ప్రకటించిన తరుణంలోనే రష్యన్‌ సైనికులు జరిపిన దాడిలో 30 మందికి పైగా ఉక్రెెనియన్లు మరణించడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement