Tuesday, November 26, 2024

నేటి సంపాద‌కీయం – రాహుల్‌ స్వయంకృతం.!

ఐదు రాష్ట్రాల అసెంబ్లి ఎన్నికల ఫలితాలపై సమీక్ష కోసం సోమవారం ఢిల్లిలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సిడబ్యుసీ) సమావేశం ఉరుములు, మెరుపులు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. ఈ కమిటీలో మొత్తం 57 మంది సభ్యులున్నారు. వీరంతా పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేత నియమింపబడిన వారే. ఆమెకు కానీ, ఆమె కుమారుడు రాహుల్‌కి కానీ వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం వీరిలో ఎవరికీ లేదు. అందుకే వారిలో ఏ ఒక్కరూ కూడా నోరు మెదపలేదు. ఈ విషయాన్ని మంగళవారం నాడుపార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ దుయ్యబట్టారు. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో పంజాబ్‌ కాంగ్రెస్‌కి చాలా ముఖ్యమైనదనీ, అక్కడ అధికారాన్ని ఎందుకు కోల్పోవలసి వచ్చిందో అరమరికలు లేకుండా చర్చించి తప్పులు దిద్దుకుంటే పార్టీకి మేలు జరిగి ఉండేదని సిబాల్‌ అన్నారు. ఆయన మాటల్లో ఎంతో నిజాయితీ, నిబద్ధత కనిపిస్తున్నాయి. తాను ఏ ఇతర పార్టీతోనో సంప్రదింపులు జరుపుతూ గోడదూకాలని ప్రయత్నించడం లేదనీ, తుది శ్వాసవరకూ కాంగ్రెస్‌ లోనే కొనసాగుతానని ఆయన స్పష్టంచేశారు.

కాంగ్రెస్‌ కోసం ఎంతో శ్రమించినవారిలో తానూ ఒకడిననీ, పార్టీ ఈనాటి పరిస్థితిచూస్తే గుండె తరుక్కుపోతోందనీ, అందుకే తన బాధ వెళ్ళగక్కుతున్నానంటూ ఆయన చెప్పిన మాటల్లోని ఎంతో నిజాయితీ కనిపించింది. మిగిలిన రాష్ట్రాల మాట ఎలా ఉన్నా, పంజాబ్‌లో అధికా రాన్ని పార్టీ చేజేతులా పోగొటుకుందని ఆయన అన్నారు. రాహుల్‌ గాంధీ ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు కాకపోయినా, పార్టీలో విధానపరమైన, కీలకమైన నిర్ణయాలన్నీ ఆయ నే తీసుకుంటున్నారనీ, ఇందుకు ఉదాహరణ పంజాబ్‌ లో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ని సాగనంపిన తీరేనని కపిల్‌ సిబాల్‌ అన్నారు. ఈ అభిప్రాయం పార్టీలో చాలా మందిలో ఉన్నా, వారెవరూ పైకి ప్రస్తావించే ధైర్యం చేయలేదు. పంజాబ్‌లో పార్టీ వ్యవహారాల గురించి వర్కింగ్‌ కమిటీలోనూ, ఇతర వేదికలపైనా చర్చించ లేదని ఆయన అన్నారు. ఈవిషయంలో పార్టీ అధ్యక్షురా లు సోనియాగాంధీ ఆమోదం ఉందో లేదో కూడా తెలియదని అన్నారు. రాహుల్‌ గాంధీ సీనియర్లను పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాలు పార్టీకి మేలు చేసేవి అయితే స్వాగతించాల్సిందే. పంజాబ్‌లో పీసీసీ అధ్యక్ష పదవిని మాజీ క్రికెటర్‌ నవ జ్యోతి సింగ్‌ సిద్ధూకి ఇవ్వడం కూడా రాహుల్‌ నిర్ణయమే. సిద్ధూ బీజేపీ నుంచివచ్చారు. బీజేపీ నుంచి వచ్చిన ఆయనకు ఆ పదవి ఇవ్వడాన్ని పార్టీలో సీనియర్లు వ్యతి రేకించారు.

నిజం చెప్పాలంటే, సిద్దూ వల్లనే పంజాబ్‌లో కాంగ్రెస్‌ అధికారాన్ని కోల్పోయింది. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ సీనియర్‌ నాయకుడు మాత్రమే కాదు, ఎంతో కాలంగా పార్టీ మేలు కోసం కృషి చేసిన వాడు. అటువంటి నాయకుణ్ణి అత్యంత అవమానకరంగా తప్పించడంలో సిద్ధూ ఒత్తిడి ఉందని ఆనాడే వార్తలు వచ్చాయి. పంజాబ్‌ లో కొత్త రక్తాన్ని ప్రోత్సహించాలంటూ సిద్ధూ చేసిన ప్రచారం మంచి చేయేకపోగా బెడిసి కొట్టింది. ఇతర రాష్ట్రాల్లో కూడాపార్టీ అధ్యక్షుల నియామకంలో రాహుల్‌ ఏక పక్ష నిర్ణయాలను తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వయసురీత్యా, అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ విషయాలేమీ పట్టించుకోలేదు. పైగా ఆమెకు తన కుమారుని శక్తి సామర్ధ్యాల మీద అపారమైన నమ్మకం ఉంది. ఎవరేమి చెప్పినా, ఆమె రాహుల్‌కి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటుంటారని పార్టీలో ప్రతి ఒక్కరూ చెప్పుకుం టూ ఉంటారు. పార్టీని సీనియర్‌ నాయకుల నుంచి విముక్తం చేయాలని రాహుల్‌ కంకణం కట్టుకున్నారు. నేటితరం నాయకుల్లో కూడాసమర్ధులైన జ్యోతిరాదిత్య సింధియా వంటి వారిని పక్కన పెట్టి కేవలం భజన పరులకే రాహుల్‌ ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు చాలాకాలంగా వస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో కడపటి అసెంబ్లి ఎన్నికల ముందు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్‌ పైలట్‌లకు రెండున్నర ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి ఇస్తామని ఎన్నికల ముందువాగ్దానం చేసిన రాహుల్‌ దానిని విస్మరించడం వల్లనే సింధియా బీజేపీలోకి వెళ్ళారు, సచిన్‌ పైలట్‌ కూడా బీజేపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నించినా, సోనియాగాంధీ సలహాపై ఆగిపోయారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇతర రాష్ట్రా ల్లో కూడా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవుల విషయంలో రాహు ల్‌ గాంధీ వాగ్దానాలను విస్మరించడం వల్ల ఆశో పహతులైన వారు పార్టీకి కొందరు దూరమయ్యారు. మరికొంద రు ఆ ఆలోచనలోనే ఉన్నారు. రాహుల్‌ పంజాబ్‌లో ప్రయోగించిన దళిత కార్డు పని చేయలేదు. దళితులలో చరణ్‌జిత్‌ చన్నీ కన్నా సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. వారిని నిర్లక్ష్యం చేసి తన కోటరీ సూచన మేరకు చన్నీని రాహుల్‌ ఎంపిక చేశారు. కేరళలోనూ అంతే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement