Friday, November 22, 2024

నేటి సంపాదకీయం‌‌–అన్నంత పనిచేసిన పుతిన్‌

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నంత పనీ చేశారు. ఉక్రెయిన్‌ని ఇంతకాలం హెచ్చరిస్తూ వచ్చిన పుతిన్‌ గురువారం తెల్లవారుతుండగానే ఉక్రెయిన్‌ నగరాలపై క్షిపణుల దాడి జరిపించారు. దీని వల్ల వందలాది మంది మరణించారు. యుద్ధం అనేది ఎప్పుడూ ప్రాణ,ఆస్తి నష్టాలను కలిగించేదే. అందుకే, యుద్ధాన్ని నివారించేందుకు అంతర్జాతీయ స్థాయిలో వరుసగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సోవియ ట్‌ యూనియన్‌ కుప్పకూలకముందు, అమెరికాకు, సోవియట్‌ రష్యాకూ మధ్య ప్రచ్ఛన్నయుద్ధంలో కోట్లాది డాలర్ల నష్టం సంభవించింది. లెక్కలేనంత మంది మరణించారు. రెండు ప్రపంచ యుద్ధాల్లో కూడా అపారంగా ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించాయి. జపాన్‌ లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై జరిగిన దాడుల గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.అమెరికాను యుద్ధోన్మాదిగా పదే పదే విమర్శించిన రష్యాయే ఇప్పుడు యుద్ధానికి పాల్పడటం శోచనీయం. ఉక్రెయిన్‌ విషయమే తీసుకుంటే రష్యా ఆ దేశం తూర్పు ప్రాంత నగరాలపై దాడులు జరిపించడం ఇది మొదటి సారి కాదు. ఎనిమిదేళ్ళ క్రితం క్రిమియా ప్రాంతాన్ని ఇదే మాదిరిగా రష్యా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి రష్యన్‌దళాలు ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. ఇటీవల ఉక్రెయిన్‌ సరిహద్దులకు లక్షకు పైగా సైన్యాన్ని పుతిన్‌ తరలించినప్పుడే యుద్ధం అనివార్య మని అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు అంచనా వేశాయి. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది.

సోవియట్‌లో అంతర్భాగాలు గా ఉండి విడిపోయిన తర్వాత స్వాతంత్య్రాన్ని ప్రకటిం చుకున్న దేశాల మీద కన్నా ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యేక శ్రద్ధచూపడానికి కారణం ఆ దేశంలో ఉన్న ఖనిజ సంపద, సహజవనరులే. అమెరికాకు కూడా ఉక్రెయిన్‌ పై ప్రేమకు అసలు కారణం ఇదే. ప్రస్తుత ఏకైక అగ్ర రాజ్యం, ఒకనాటి అగ్రరాజ్యానికి నేతృత్వం వహించిన రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌ కోసం పోటీ పడుతున్నాయి. ఉక్రెయిన్‌లోభారీగా ఇనుము, బొగ్గు, గ్రాఫైట్‌, వంటి ఖనిజాలు ఉన్నాయి. అయితే, పూర్వపు సోవియట్‌ యూనియన్‌లో ఉక్రెయిన్‌ అంతర్భాగంగా ఉన్నప్పుడు రష్యన్‌ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఉక్రెయిన్‌ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు పెట్టారని పేర్కొంటు న్నారు. ఉక్రెయిన్‌ ఒకనాటి తమ అంతర్భాగ దేశమైనం దున ఆ దేశంపై తమకు ఆసక్తి ఉండటంలో తప్పులేదనీ, అమెరికాకు, దాని నేతృత్వంలోని నాటో కూటమికి ఉక్రెయిన్‌పై దృష్టిని ఎందుకు కేంద్రీకరిస్తున్నాయని రష్యన్లు ప్రశ్నిస్తున్నారు. క్రెమియన్‌ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించుకున్నప్పుడు అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే అంతకన్నా తీవ్రమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా ఇప్పుడు మళ్ళీ హెచ్చరిం చింది.ఉక్రెయిన్‌పై దాడిని నివారించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ పలుమార్లుఫోన్‌లో సంభాషణలు జరిపారు.

ఆ తర్వాత జి-7 దేశాలు రష్యా వైఖరిని ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించాయి. కాగా, ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో రష్యా మద్దతు దళాలకూ,ఉక్రెయిన్‌ దళాలకూ మధ్య 2014 నుంచి జరుగుతున్న ఘర్షణల్లో 10వేలమందిపైగా మరణించా రు. ఉక్రెయిన్‌ని ఆక్రమించుకునే ఉద్దేశ్యం తమకు లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇప్పటికీ స్పష్టం చేస్తున్నారు. నాటో కూటమి దేశాలను అడ్డుకోవడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యాదాడిని చైనా,పాకిస్తాన్‌లు సమర్ధించడాన్ని బట్టి పథకం ప్రకార మే పుతిన్‌ ఈ దాడి జరిపించినట్టు స్పష్టం అవుతోంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తరణ పోకడలను అమెరికా,జపాన్‌,భారత్‌లతోఏర్పడిన క్వాడ్‌ వ్యతిరేకిస్తు న్నందున, చైనాయే రష్యాను ఈ యుద్ధానికి పురికొల్పి ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఉక్రెయిన్‌ ప్రజల కోసవే తమ దేశం దాడి చేసిందన్న పుతిన్‌ వాదన వింతగా ఉంది. రష్యా, చైనాలు అలనాడు అమెరికాది ప్రాబల్య విస్తరణవాదమని ఆరోపించాయి. ఇప్పుడు ఆ రెండు దేశాలు పొరుగు దేశాల భూభాగాలను తమ దేశంలో కలిపివేసుకునేందుకు, లేదా దురాక్రమణ ద్వారా స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తు న్నాయి. ప్రపంచీకరణ అమలులోకి వచ్చిన తర్వాత ఈ రెండు దేశాలూ ఫక్తు వాణిజ్య ధోరణిలో వ్యవహరిస్తు న్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ జీవితకాలపు అధ్యక్షు నిగా కొనసాగేందుకు రాజ్యాంగాన్ని మార్చినట్టే, పుతిన్‌ కూడా తమ దేశ రాజ్యాంగాన్ని సవరించుకున్నారు. పొరుగుదేశాలను ఆక్రమించుకోనవడంలోనూ, శాశ్వతంగా పదవిలో కొనసాగడంలోనూ వీరిరువురిలో పోలికలుఉన్నట్టు కనిపిస్తోంది. ఉక్రెయిన్‌ పై రష్యాదాడి ప్రభావం చమురు రంగంపై స్పష్టంగా కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement