Tuesday, November 26, 2024

నేటి సంపాద‌కీయం – అర్ధశతాబ్ది వివాదానికి తెర..

అసోం, మేఘాలయ సరిహద్దు రాష్ట్రాలు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సరిహద్దు రాష్ట్రాల్లో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని కనుగొంటున్నారు. బంగ్లాదేశ్‌లో మన దేశానికి గల సరిహద్దు వివాదాన్ని ఇచ్చి పుచ్చుకునే రీతిలో పరిష్కారాన్ని కనుగొన్నారు. ఇప్పుడు అసోం, మేఘాలయల మధ్య అర్థశతాబ్దంపైగా నలుగుతున్నవివాదంపై కేంద్రహోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంగళవారం ఒక అంగీకారానికి వచ్చారు. ఇది చారిత్రక ఒప్పందమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభివర్ణించారు. ఈ ఒప్పందపత్రంపై అసోం ముఖ్యమంత్రి బిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కనోర్డ్‌ సాంగ్మాలు సంతకాలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో అసోం పెద్దది. భౌగోళికంగా, వాణిజ్య సంబంధాల విషయంలోనే కాకుండా తమ సరిహద్దులను అసోం కబళిస్తోందన్న అపోహ మేఘాలయకే కాదు, మిజోరంకి కూడా ఉంది. మిజోరం, అసోం సరిహద్దు వివాదం ఘర్షణకు దారితీయడంతో గత అక్టోబర్‌లో పలువురు గాయపడ్డారు.

ఈ రెండు రాష్ట్రాలకు కేంద్రం సర్దిచెప్పినా అవి ఓ పట్టాన అంగీకారానికి రాలేదు. అదే మాదిరిగా మేఘాలయతోనూ అసోంకి చాలా కాలంగా సరిహద్దు వివాదం ఉంది. మొత్తం 885 కిలోమీటర్ల పొడవున ఇరురాష్ట్రాల మధ్య సరిహద్దు ఉంది. 12 ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంఉంది.ఇప్పుడు ఆరు ప్రాంతాల్లో 32 గ్రామాల సరిహద్దులపై వివాదానికి తెరపడింది. నిజానికి మిజోరంతో కానీ, మేఘాలయతో కానీ సరిహద్దు వివాదాలు ఈనాటివికావు. బ్రిటిష్‌ వారి కాలం నుంచి ఉన్నాయి. బ్రిటిష్‌ వారే ఈ ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. అరుణాచల్‌ ప్రదేశ్‌తో కూడా సరిహద్దు వివాదం ఉంది. మిగిలిన సరిహద్దు రాష్ట్రాల కన్నా అరుణాచల్‌ వివాదం చాలా సున్నితమైనది. ఈ రాష్ట్రంలో పలు సరిహద్దు ప్రాంతాలను తమవిగా చైనా ఇప్పటికీ ప్రకటిస్తోంది. మ్యాప్‌లలో చూపిస్తోంది. మిజోరం, మేఘాలయ, మణిపూర్‌ నాగాలాండ్‌ అన్నీ ఒకప్పుడు అసోం అంతర్భాగాలే. 1971నాటి ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కిందమేఘాలయ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అసోంకి సరిహద్దు వివాదాన్ని తేలిగ్గా పరిష్కరించడానికి అవకాశాలు ఉన్నా, గత ప్రభుత్వాలు నానబెట్టాయి. మేఘాలయ నుంచి లోక్‌సభకు ఎన్నికైన సాంగ్మా లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించారు. ఆయన హయాంలో మేఘాలయలో కొంత అభివృద్ధి జరిగింది.

ఆయన కుమారుడే ప్రస్తుత ముఖ్యమంత్రి కనోర్డ్‌ సంగ్మా. నాగాలాండ్‌ సమస్య కూడా అలాంటిదే. ఓట్ల కోసం ఈ ప్రాంతాలలో సరిహద్దు వివాదాలను రాజకీయ నాయకులే సృష్టిస్తున్నారన్న ఆరోపణలను పూర్తిగా కొట్టివేయలేం. అలాగే, తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం వల్ల కూడా సరిహద్దు ప్రాంతాలు అశాంతికిలోనవుతున్నాయి. నాగాలాండ్‌లో మయన్మా ర్‌ తీవ్రవాదులు స్థావరాలు ఏర్పరుచుకుని అశాంతిని సృష్టిస్తున్నారు. నాగాలాండ్‌ విషయంలో తలెత్తిన వివాదాన్ని కేంద్రం ఇటీవల పరిష్కరించింది. అయినప్పటికీ మయన్మార్‌ ప్రభుత్వం నాగా తీవ్రవాదులను రెచ్చగొడుతూ అశాంతిని సృష్టిస్తున్నది. మేఘాలయలో అమూల్యమైన ఖనిజాలు ఉన్నాయి. సున్నపురాయి, బొగ్గు యురేనియం, నిక్షేపాలు ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కొండలతో చుట్టుముట్టి ఉంటుంది. బంగ్లాదేశ్‌ నుంచి ఇతర పొరుగుదేశాలనుంచి మేఘాలయలోకి తీవ్రవాదులు ప్రవేశిస్తుంటారు. సరిహద్దు గ్రామాలకు రహదారి సౌకర్యాలు ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నాయి. వీటితో పోలిస్తే అసోం కాస్తంత అభివృద్ది చెందింది. బ్రిటిష్‌ కాలం నాటి పద్దతులు, నియమనిబంధనలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి.

సరిహద్దురాష్ట్రాలకు కమ్యూనికేషన్‌ సౌకర్యాల విషయంలో కూడా ఇంత కాలం అశ్రద్ధ జరిగింది. ఇప్పుడిప్పుడే రోడ్లు, టెలికామ్‌ సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. విద్య, వైద్య సౌకర్యాలు కూడా అంతంతమాత్రమే. మేఘాలయతో సరిహద్దు వివాదం పరిష్కారం కావడంతో ఆ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం పూర్తి తోడ్పాటును అందించగలదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది నిధి నుంచి మేఘాలయకు నిధులు మంజూరు అయ్యేట్టు చూస్తానని హామీ ఇచ్చారు. మేఘాలయ రాష్ట్రం ఏర్పడినాటి నుంచి సరిహద్దు గ్రామాల ప్రజల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో వ్యాపారాల కోసం అసోం నుంచి వచ్చేవారిపై దాడులు కూడా జరిగాయి. ఈ ఘటనలను ఆసరాగా చేసుకొని తీవ్రవాదులు రెచ్చిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. మిగిలిన సరిహద్దు వివాదాల పరిష్కారం కోసం మోడీ కృషి చేస్తున్నారు. అర్థ శతాబ్ది పైగా నలుగుతున్న సరిహద్దు వివాదానికి తెరదించే ఈ ఒప్పందం ముమ్మా టికీ చారిత్రాత్మకమైనదే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement