ప్రభన్యూస్ : వాయుకాలుష్యం దేశ రాజధాని ఢిల్లిని బెంబేలెత్తిస్తోంది. నిన్న ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) 400గా నమోదు కావడంతో ఢిల్లి ప్రభుత్వం అప్రమత్తమై పాఠశాలలకు సెలవు ప్రకటించింది. అది కూడా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తర్వాతే. ఢిల్లిలో వాయుకాలుష్యం ప్రమాద స్థాయి మించిపోవడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్దలేమో వర్క్ ఫ్రమ్ హోం పేరుతో ఇంటి నుంచే పని చేసుకోవడానికి అనుమతి ఇస్తున్నప్పుడు రెండు మూడు తరగతుల పిల్లలను బలవంతంగా పాఠశాలలకు రప్పించడం ఏపాటి న్యాయమని ప్రశ్నించారు. తాము రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నామని అంటూనే జస్టిస్ రమణ ఢిల్లి, కేంద్ర ప్రభుత్వాలకు తీవ్ర స్థాయిలో చురకలంటించారు. కాలుష్యం గురించి ఇప్పటికి ఎన్నో సార్లు హెచ్చరికలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే ఆగ్రహిస్తున్నట్టు కారణం కూడా ఆయనే చెప్పారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమన్న ప్రాథమికవిషయాన్ని ప్రభుత్వాలు గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నించారు.
తాము తీసుకున్న చర్యలు ఫలించక పోతే నిపుణులను సంప్రదించి మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఢిల్లిలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరిందన్న విషయాన్ని అంగీకరిస్తూనే, దీనిపై నిపుణులను సంప్రదిస్తున్నట్టు సొలిసిటర్ జనరల్ తుషార్ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. దీనిపై చీఫ్ జస్టిస్ మరింత ఆగ్రహించి ఇంకా సంప్రదించడం ఏమిటి ఈ పాటికి చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. దాంతో ఢిల్లి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్టు తెలియజేసింది. పిల్లలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు మూసివేస్తే ఇక ఇతరుల సంగతి ఏమిటి? ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లిలో లాక్‌డౌన్ ప్రకటిస్తామని అన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి వాహనాల సంఖ్యను తగ్గించాలి. లేదా ప్రధానమార్గాల నుంచి కాకుండా సరిహద్దుల మీదుగా వాహనాలను మళ్ళించాలి.
ఇప్పుడు ఆ పనే చేస్తున్నట్టు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఢిల్లి కాలుష్యం ఒక్కరోజులో వచ్చింది కాదు. మొదటి నుంచి పాలకుల నిర్లక్ష్యం కారణంగా పెరిగి పెద్దదైంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ (ఆప్) ప్రభుత్వ హయాంలోనే కాకుండా, అంతకు ముందు కూడా ఢిల్లి కాలుష్యంపై సర్వోన్నతన్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేయడం, మొక్కుబడి చర్యలుప్రభుత్వాలు తీసుకోవడం జరుగుతోంది. దీని కాలుష్య నివారణ కోసం కేంద్రం కానీ, ఢిల్లి ప్రభుత్వం కానీ సావధానంగా కూర్చుని చర్చించిన దాఖలాలు లేవు. ఢిల్లి ప్రభుత్వంతో తగవులు పెట్టుకోవడంతోనే కేంద్ర ప్రభుత్వం కాలంగడుపుతోంది. ఇంతకుముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు బీజేపీ కూటమి ప్రభుత్వం ఢిల్లి ప్రభుత్వంతో టగ్ ఆఫ్ వార్ రీతిలో వ్యవహరిస్తోంది. కేంద్ర, ఢిల్లి ప్రభుత్వాల అధికార యంత్రాంగాల మధ్య సమన్వయం కొరవడడానికి ఇదే ప్రధాన కారణం. తప్పు మీదంటే మీదనే ధోరణిలో అధికార యంత్రాంగాలు వ్యవహరిస్తున్నాయి. ఢిల్లిలో వాహనాల సంఖ్యను తగ్గించడానికి సరి బేసి విధానాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
అది బాగా పని చేసినట్టు కనిపించినా రాజకీయ ఒత్తిడుల కారణంగా దానిని మధ్యలోనిలిపి వేశారు. అయితే, భారీ వాహనాలు, శబ్ద, వాయుకాలుష్య కారక వాహనాలు నగరంలో ప్రవేశించకుండా సరిహద్దు ప్రాంతాల నుంచి తరలించే ఏర్పాటు చేసినట్టు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. సరిహద్దుల్లో రైతులఆందోళన కారణంగానే కాలుష్యం పెరుగుతున్నట్టు ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొనడం పట్ల కొద్ది రోజుల క్రితం కోర్టు అభ్యంతరం తెలిపింది.ప్రభుత్వం తాను తీసుకోదల్చిన ప్రత్యామ్నాయాలను గురించి వివరించాలే తప్ప నెపాన్ని ఇతరులపై నెట్టేయడానికి ప్రయత్నించరాదని హెచ్చ రించింది. కాలుష్య నివారణకు ప్రభుత్వం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో 24 గంటల్లో తెలియజేయాలని ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రమణ సొలిసిటర్ జనరల్‌ని ఆదేశించారు. ఢిల్లిలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలోనే సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఇలాంటి ఆదేశాలు వెలువడటం గమనార్హం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital