సరిహద్దులను అతిక్రమించడంలో చైనాని మించిన దేశం ప్రపంచంలో మరి ఎక్కడా లేదంటే అతిశయోక్తి కాదు. చైనా ఆక్రమణ వాదాన్ని మొదటగా బయటపెట్టింది మన దేశమే. అరవై ఏళ్ల క్రితం చైనా దురాక్రమణలో కోల్పోయిన 90వేల హెక్టార్ల భూమి మనకు ఇంకా దక్కలేదు. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో తెలిపారు. చైనా దురాక్రమణకు గురవుతున్న దేశాల్లో ఇప్పుడు భూటాన్ చేరింది. సిక్కిం, భూటాన్ సరిహద్దుల్లో డోక్లామ్ వద్ద నాలుగు సంవత్సరాల క్రితం చైనా ఆక్రమణకు యత్నించగా, సిక్కిం సరిహద్దుల్లో సేనలను మన దేశం మోహరించడంతో వెనక్కి తగ్గింది. లడఖ్‌లోని తూర్పు ప్రాంతంలో గాల్వాన్ లోయలోకి చొచ్చుకుని వచ్చేందుకు చైనా సేనలు ప్రయత్నించినప్పుడు మన సేనలు తరిమి కొట్టాయి. భూటాన్‌లోని వివాదాస్పద ప్రాంతంలో చైనా ఇంతవరకూ రోడ్లు,తదితర మౌలిక సదుపాయాలను వృద్ధి చేసింది. ఇప్పుడు రెండు అంతస్తుల భవనాలను వందల సంఖ్యలో నిర్మిస్తోంది. భూటాన్ మన మిత్రదేశమే కాకుండా, మనకు సైనిక ఒప్పందం ఉంది. భూటాన్ ప్రాదేశిక సమగ్రతకు ప్రమాదం ఏర్పడిన ప్రతిసారీ మన దేశం సైనికులను పంపి అండగా నిలుస్తోంది.
భూటాన్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో చైనా రెండేళ్ళ నుంచి నిర్మాణాలను సాగిస్తోంది. భూటాన్ సరిహద్దుల్లో చైనా ఆరు స్థావరాలను నిర్మించింది. మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో చైనా రోడ్లు, వంతెనల నిర్మాణాలను ముమ్మరం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ తమ అంతర్భాగమంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా మరోసారి ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు భూటాన్ భూభాగంలో 110 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భవన నిర్మాణాలను చైనానిర్మిస్తోంది. చైనా తలపెట్టిన మహా మార్గంలో భాగంగా పొరుగు దేశాల్లోని సరిహద్దు ప్రాంతాలను చైనా క్రమంగా ఆక్రమించు కుంటోంది. చైనా దురాగతాలను గురించి సరిహద్దు దేశాలు ఇప్పటికే ఫిర్యాదులు చేశాయి. టిబెట్ అటానమస్ ప్రాంతంలో 600 పైగా గ్రామాలను చైనా నిర్మిస్తోందని 2017లోనే మసాచ్యూట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ వెల్లడించింది. టిబెట్ లోనూ, సరిహద్దు ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటున్నామని సాకులు చెబుతూ పొరుగు దేశాల భూభాగాల్లోకి చైనా చొచ్చుకుని వస్తోంది. చైనా చేపట్టిన నిర్మాణాలన్నీ గతంలో అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేని చోటునే నిర్మించబడ్డాయి.
అక్కడి ఆవాసాల్లో నివసించేందుకు ముందుకు వచ్చే చైనీయులకు చైనా ప్రభుత్వం పారితోషికాలు ఇస్తోంది. తరచుగా దాడులకు గురి అయ్యే ప్రాంతాల్లో నివసించే వారికి చైనా ప్రభుత్వం ఇలాంటి పారితోషికాలు ఇవ్వడం సాధారణమే. భూటాన్ చైనా నుంచి ఈ మాదిరి సరిహద్దు సమస్యను ఎదుర్కోవడం కొత్త కాదు. గడిచిన నలభై సంవత్సరాల నుంచి భూటాన్‌కు ఇదే మాదిరిగా చైనా సమస్యలు సృష్టిస్తోంది. భూటాన్ భారత్‌తో సన్నిహితంగా ఉండటమే ఇందుకు కారణం. భూటాన్ మాత్రమే కాదు, శ్రీలంక, నేపాల్ తదితర చైనా బాధిత దేశాలకు భారత్ సమయం వచ్చినప్పుడు అండగా నిలుస్తోంది. భూటాన్‌తో మన దేశానికి 434 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. భూటాన్‌తో మన దేశానికి సాంస్కృతిక పరంగా సంబంధాలు ఉన్నాయి. భూటాన్‌లో విద్యుత్ కేంద్రాల నిర్మా ణంలో మన దేశం తోడ్పడింది. భారత్‌ని నమ్మకమైన మిత్రదేశంగా భూటాన్ పరిగణి స్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital