Friday, November 22, 2024

నేటి సంపాద‌కీయం – కొత్త వివాదంలో మమత!

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ థంకర్‌తో ముఖ్య మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మళ్లి వివాదానికి తలపడ్డారు. గవర్నర్‌ తన పని చూసుకోవాలనీ, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని మమత ఘాటుగా మాట్లాడటంతో గవర్నర్‌ అంతకన్నా ఘాటుగా ఆమెకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తుంటే మౌన ప్రేక్షకునిగా కూర్చోలేనని ఆయన హెచ్చరించారు. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య వివాదానికి కారణమైన ఘటన చిన్నదేమీ కాదు. బీర్భమ్‌ జిల్లాలోని రామపూర్‌ అనే పట్టణంలో గత సోమవారం భుడే షేక్‌ అనే తృణమూల్‌ కార్యకర్త నాటుబాంబు పేలుడు సంఘటనలో మరణించాడు. అందుకు ప్రతీకారంగా ఆ పార్టీ వారు ఒక ఇంటికి నిప్పు పెట్టారు. ఆ ఇంట్లో ఉన్న ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు. దీంతో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి, గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై గవర్నర్‌ వెంటనే స్పందించినందుకు మమతకు కోపం వచ్చింది. ఆ సంఘటన జరిగిన పట్టణానికి తాను గురువారం వెళ్తాననీ, న్యాయం జరిగేట్టు చూసానని ప్రకటించారు. అలా అంటూనే ఇలాంటి సంఘటనలు అన్ని చోట్లా జరుగుతున్నాయనీ, గుజరాత్‌లో, రాజస్థాన్‌లో చోటు చేసుకున్నాయని అన్నారు.

ఆమె సమాధానంతో గవర్నర్‌ ఆగ్రహోదగ్రుడయ్యారు. ఎప్పుడో జరిగిన సంఘటనలను ఏకరవు పెడుతూ ఎదురుదాడి చేయడం సరికాదనీ, అన్ని వర్గాల ప్రజలకూ రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఈ సంఘటన జరిగిన పట్టణానికి తమను రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళనివ్వలేదని బీజేపీ నాయకులు ఫిర్యాదుచేయగా, గతంలో ఒక యువతి పై హత్యాచారం జరిగిన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కి తమ పార్టీ నాయకులను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వెళ్ళనివ్వలేదనీ, బీజేపీకో న్యాయం, తృణమూల్‌కో న్యాయమా అని ఆమె ప్రశ్నించారు. గవర్నర్‌తో మమతకు ఇలాంటి వివాదాలు జరగడం ఇది మొదటి సారి కాదు. ఆయన వచ్చిన కొత్తలో దుర్గా పూజా ఉత్సవాలకు అడ్డు చెప్పారంటూ ఆమె ధ్వజమెత్తారు. అలాగే, పోలీసు కమిషనర్‌ బదిలీపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మమత మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఫలితాలు వెలువడిన వెంటనే ఘర్షణలు జరిగాయి. తాను మళ్ళీ ప్రమాణం చేయకుండానే జరిగిన ఈ ఘటనలకు రాష్ట్ర గవర్నర్‌దే బాధ్యత అంటూ ఆమె వాదించడంతో గవర్నర్‌ కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేశారు. అంతకుముందు, ఎన్నికలప్రచారానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు జెపీ నడ్డా కోల్‌కతా వెళ్ళినప్పుడు హింస చోటు చేసుకుంది.

దాంతో ఆయన తన పర్యటనను అర్థంతరంగా ముగించుకుని ఢిల్లి వెళ్ళిపోయారు. ఈ సంఘటనపై కూడా గవర్నర్‌ సీరియస్‌ అయ్యారు. రాష్ట్రంలో జరిగే ప్రతి ఘటనపైనా గవర్నర్‌ బీజేపీ నాయకుని మాదిరిగా స్పందిస్తూ కేంద్రానికి చాడీలు చెబుతున్నారంటూ మమత ధ్వజమెత్తారు. కేంద్రంలోని పెద్దలే తనను వేధించడానికి థంకర్‌ని గవర్నర్‌గా నియమించారంటూ ఆమె ఆరోపించారు. ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్‌షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రతి సంఘటనపైనా గవర్నర్‌ నివేదికను ఢిల్లి పెద్దలు తెప్పించుకుంటున్నారనీ, తన ప్రభుత్వాన్ని సాఫీగా పని చేయనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని కూడా మమత ఆరోపించారు. ఈ సందర్భంలోనే ఫెడరల్‌ స్ఫూర్తిని బీజేపీ నాయకులు ముఖ్యంగా కేంద్ర నాయకులు ఉల్లంఘిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో పవిత్రమైన గంగానదిలోకి కరోనా రోగుల శవాలను విసిరేస్తే, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకోలేదని మమత ఎదురుదాడి చేశారు. పాతసంఘటనలను గుర్తు చేస్తూ బీజేపీ కేంద్ర నాయకులపై ఎదురుదాడి చేయడం మమతకు అలవాటు. తన ప్రభుత్వంపై చర్య తీసుకునేందుకు కమల నాథులు కుట్ర పన్నారని కూడా ఆమె ఆరోపించారు. ప్రధానమంత్రిపై నేరుగా విమర్శలు చేయడానికి వెనుకాడని మమత ఇటీవల ఉక్రెయిన్‌ నుంచి భారత విద్యార్దులను వెనక్కి రప్పించేందుకు కేంద్రం ప్రవేశ పెట్టిన ఆపరేషన్‌ గంగా కార్యక్రమాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రిని అభినందిస్తూ లేఖ రాశారు.

తనకు ఎవరితోనూ వ్యక్తిగత విరోధం లేదనీ, సమస్యల ప్రాతి పదికపైనే పోరాడుతానని ఆమె పలుసార్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రావల్సిన నిధుల విషయంలోనూ ఆమె చాలా నిష్కర్షగా డిమాండ్‌ చేస్తుంటారు. ఆ నిధులేమీ కేంద్రం దయాదాక్షిణ్యంతో ఇచ్చేవి కావనీ, రాష్ట్రానికి రాజ్యాంగ బద్దంగా రావల్సి నవేనని ఆమె తరచూ వాదిస్తూ ఉంటారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం ఆమె కృషి చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement