Friday, November 22, 2024

నేటి సంపాద‌కీయం – మ‌హా క‌ల‌క‌లం!

మహారాష్ట్ర మైనారిటీల వ్యవహారాల శాఖ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఐదు గంటల సేపు ప్రశ్నించి చివరికి అదుపులో తీసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. మరాఠా యోధునిగా పేరొందిన ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ మాలిక్‌ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. వాస్తవాలు మాట్లాడు తున్న ప్రతిపక్ష నాయకుల నోళ్ళు నొక్కడానికి కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం సీబీఐ, ఈడీ సంస్థలను ప్రయోగిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో తమ పార్టీ నాయకుడు నవాబ్‌ మాలిక్‌పై ఈడీ అధికారులు మోపిన అభియోగాలు నిలబడవని ఆయన అన్నారు. అయితే, దావూద్‌ ఇబ్రహీమ్‌ సోదరుడు కసక్‌ ఇచ్చిన సమాచారం మేరకు నవాబ్‌ మాలిక్‌ని ప్రశ్నించేందుకు బుధవారం ఉదయం ఆయన నివాసానికి ఈడి అధికారులు వెళ్ళారు. ఆయన దాటవేత సమాధానాలు ఇవ్వడంతో ఆయనను ఈడీ ఆఫీసుకు తీసుకుని వచ్చి మళ్ళీ ప్రశ్నించారు. ఆయన అరెస్టు ముంబాయిలోనూ, మహారాష్ట్రలోనూ తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఎన్సీపీ కార్యకర్తలు ప్లకార్డులు చేతపట్టుకుని ఈడీ కార్యాలయం వద్ద పెద్ద ప్రదర్శన నిర్వహించారు.

దావూద్‌తో నవాబ్‌ మాలిక్‌ భూమి విషయంలో లావాదేవీలు జరిపారనీ, ఈ విషయంలో దావూద్‌ సోదరుడు, సోదరిల నివాసాలను సోదా చేశామనీ, వాస్తవాలు రాబట్టేందుకే ఈ సోదాలు నిర్వహించామనీ, ఇందులో రాజకీయ ప్రమేయం ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, మాలిక్‌ అరెస్టును రాజకీయంగానే ఎదుర్కోవాలని ఎన్సీపీ నిర్ణయించుకుంది. ఎన్సీపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమికి శివసేన నేతృత్వం వహిస్తున్నా, ఎన్సీపీ నాయకుడు, శరద్‌ పవార్‌ తెరవెనుక నుండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆయనను తమ వైపుతిప్పుకోవడానికి ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌ షాలు చేసిన యత్నాలు ఫలించలేదు. పైగా ఆయన మోడీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేయనున్న ఫ్రంట్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రాంతీయ పార్టీల యత్నాలను బలహీనపర్చేందుకు కేంద్రంలో కమలనాథులు ఈడీనీ, సీబీఐని అస్త్రాలుగా ఉపయోగిస్తోందని ప్రాంతీయ పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.

నవాబ్‌ మాలిక్‌ మహారాష్ట్ర కేబినెట్‌ మంత్రిగా కేంద్రంపై తరచూ విమర్శలు చేస్తున్న మాట నిజమే. ఫెడరల్‌ స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన పెక్కుసార్లు ఆరోపించారు.అంతేకాకుండా బాలీవుడ్‌ బాద్షాగా పేరొందిన షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ) అరెస్టు చేసినప్పుడు నవాబ్‌ మాలిక్‌ అతడి తరఫున పలు సార్లు ప్రకటనలు చేశారు. అన్యాయాన్ని ఎదిరిస్తుండటం వల్లనే నవాబ్‌ మాలిక్‌ని అరెస్టు చేశారని ఎన్సీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాగా, నవాబ్‌ మాలిక్‌ అరెస్టుకీ,పాత గొడవలకీ సంబంధం లేదని ఈడీ అధికారులు తెలిపారు. దావూద్‌ ఇబ్రహీంతో మనీ ల్యాండరింగ్‌ జరుపుతున్న వారిపై దర్యాప్తు జరుపు తుండగా, నవాబ్‌ మాలిక్‌ పేరు తెరమీదికి వచ్చిందని వారు చెబుతున్నారు. కాగా, మనీ ల్యాండరింగ్‌ కేసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని మనీ లాండరింగ్‌ నేరానికి పాల్పడి విదేశాల్లో ఉంటున్న వారి నుంచి ఇంత వరకూ 18,000కోట్లు వసూలు చేశామని అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ (పిఎంఎల్‌) కేసుల విషయంలో అధికారులు వేధిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. అయితే, తమకు అందిన సమాచారంలో నిర్దిష్టమైన ఆధారాలున్న కేసులపైనే దర్యాప్తు చేస్తున్నామనీ, ఎవరినీ వేధించడం లేదని అధికారులు కోర్టుకు తెలియజేశారు.

అయితే, ప్రతిపక్షంలో ఉన్న వారిపైనే ఈడీ అధికారులు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారనీ, కమలనాథుల్లో ఈ విధమైన ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్న వారి జోలికి ఈడీ అధికారులు వెళ్లడంలేదని బీజేపీయేతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌ వాదీపార్టీ సానుభూతి పరులపై ఈ చట్టాన్ని ప్రయోగించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. నవాబ్‌ మాలిక్‌ అరెస్టు ఉత్తరప్రదేశ్‌లో కీలకమైన ఐదవ దశ ఎన్నికల సందర్భంగా జరగడం వల్ల దీని రాజకీయ రంగు ఇచ్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా శరద్‌ పవార్‌ పార్టీలో కీలకమైన వ్యక్తినీ, అందునా, రాష్ట్ర మంత్రిని మనీల్యాండరింగ్‌ కేసులో అరెస్టు చేయడం తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. మాలిక్‌ అరెస్టుపై ఎన్సీపీ జాతీయ స్థాయిలో ఆందోళన సాగించే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement