Tuesday, November 19, 2024

నేటి సంపాదకీయం-అక్షరాలా చిరంజీవి!

ప్ర‌భ‌న్యూస్ : తెలుగు సినిమాల్లో సాహిత్యపు విలువలను నిలబెట్టి, జనసామాన్యాన్ని ఆకట్టుకున్న గీత రచయితలు ఇప్పుడు ఎవరూ లేరన్న అభిప్రాయాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి తోసిపుచ్చారు. ఆయన ఇంటిపేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సిరివెన్నెల చిత్రంతో సినీరంగంలో ప్రస్థానం ప్రారంభించిన సీతారామశాస్త్రి తొలిచిత్రమే ఇంటిపేరు కావడం ఆయన అంకిత భావానికి నిదర్శనం. సినిమాని వినోదం కోసమే చూస్తారనీ, సినిమా ద్వారా సందేశం ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించే వారికి దీటైన సమాధానంగా కళాతపస్వి కె.విశ్వనాథ్‌ పలు చిత్రాలు అందించారు. వాటిలో సిరివెన్నెల ముఖ్యమైనది. ఈ చిత్రంలో హీరో గుడ్డివాడు. హీరోయిన్‌ మూగది. అయినప్పటికీ పాటల ద్వారానే ఆ చిత్రం జనాన్ని ఆకట్టుకుంది. పైగా ఆ సినిమాకి అన్ని పాటలనూ కొత్త రచయిత చేత రాయించిన విశ్వనాథ్‌ తన పై ఉంచిన విశ్వాసాన్ని సీతారామశాస్త్రి నిలబెట్టుకున్నారు. ఆ చిత్రంలో సాహిత్యపు విలువలు పండిత, పామరు లను సైతం ఆకర్షించాయి.

శివుణ్ణి ఆరాధిస్తూ తెలుగు సినిమాల్లో పౌరాణికాల్లోనే కాదు, సాంఘికాల్లో అనేక పాటలు వచ్చాయి. కానీ, సిరివెన్నెల పాటల్లో శివుణ్ణి నిందిస్తున్నట్టు కనిపించినా, అంతర్గతంగా శివారాథనే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రాచీన సాహిత్యంలో కూడా నిందాస్తుతి కావ్యాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. అలాంటి పాటలు రాసిన సీతారామశాస్త్రి తొలి సినిమాతోనే తన ప్రతిభను చాటుకునే అవకాశం వచ్చింది.. బూడిద ఇచ్చేవాడిని ఏమి అడిగేది అనే చరణంలో శివుణ్ణి ప్రార్థిస్తే బూడిదేగా మిగిలేది అనే అర్థం పైకి కనిపిస్తుంది. సృష్టిలో ఏ వస్తువు అయినా,, ఎవరైనా చివరికి మనుషులైనా బూడిద కావ ల్సిందేనన్న భావం అంతర్లీనంగా అందులో ద్యోతకమవుతుంది.ఆధునిక కాలంలో శిరిడీ సాయిబాబా కూడా తన భక్తుల కోర్కెలను ఈడేర్చేందుకు సంకేతంగా విభూతిని ఇస్తు న్నారు.

అందువల్ల సిరివెన్నెల రాసిన పాటలో ఎంతో లోతైన అర్థం ఉంది. సమాజంలో కనిపించే కుళ్లును కడిగేయాలని యువతకు పిలుపు ఇస్తూ సిగ్గులేని సమాజాన్ని నిగ్గదీసి అడుగు అంటారు ఓ పాటలో. ఆయన పాటల్లో మానవతావాదం, సామాజిక స్పృహ ఎక్కువగా కనిపిస్తుంది. సహేతుకత,ప్రశ్నించే తత్వం స్ఫురిస్తుంది. సాహిత్యపు విలువలను కాపాడుతూనే సమకాలీన సమాజంలో పోకడలను ఆయన ఎండగట్టినతీరు అమోఘం. అందుకే,ఆయన మరణ వార్త వినగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ,తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,కేంద్ర మంత్రులు ఒకరేమిటి రాజకీయ రంగానికి చెందిన ప్రము ఖులంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సినీ రంగంలో అన్ని స్థాయిల్లో వారూ ,అన్నితరాల వారూ సిరివెన్నెలతో తమ జ్ఞాపకాలను ఇతరులతో నెమరు వేసుకున్నారు.సిరివెన్నెలకు భేషజం లేదు, అందరితో కలివిడిగా, కలిసిమెలిసి ఉంటూనే వ్యక్తిత్వపు విలువలను కాపా డుకున్న సాహితీ వేత్త. అందుకే, ఆయనను ఒక సినిమా కవిగానే కాకుండా, సాహితీ వేత్తగా గౌరవిస్తూ ఉంటారు.

అన్నివర్గాల వారూ సిరివెన్నెల తమ వాడేనన్న భావాన్ని కలిగించ డం వల్లనే ఆయన మరణ వార్త వినగానే అన్ని వర్గాలవారూ గుండెలవిసేలా విలపిం చారు. తెలుగు సినీ రంగంలో సాహితీ స్రష్టలు ఎంతో మంది ఉండేవారు. వారిలో కాలాను గుణంగా వచ్చిన మార్పులకు స్పందించి తమ గీతాల్లో ఆధునిక పోకడలు చూపించారు. అయితే, సీతారామశాస్త్రి మాత్రం తాను విశ్వసించిన సాహిత్యపు విలువల గీత దాటకుం డానే అన్ని రసాలు ఒలికించే గీతాలను రాశారు. తెలుగు సినీ రంగంలో పదకొండు నంది అవార్డులు అందుకున్న గీత రచయిత ఆయనే. అలాగే, ఏ విధమైన రాజకీయ ప్రాపకం లేకపోయినా పద్మశ్రీ పురస్కారాన్నీ, ఇతర పురస్కారాలను అందుకున్నారు. సిరివెన్నె లలో ఒక సినీ రచయిత కన్నా ఆత్మీయుడైన మిత్రుడున్నాడు. నిర్మొహమాటంగా ఉంటూనే, అందరితో కలివిడిగా ఉండేవారు. పింగళి, మల్లాది, ఆత్రేయ శ్ర్రీశ్రీ, సముద్రాల,వేటూరి వంటి సాహితీ ఉద్దండులు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. వారి బాటలో సిరివెన్నెల కూడా ఉన్నత విలువలను కాపాడుతూ సాహితీ వ్యాసంగం సాగించారు.అందుకే ఆయన మరణవార్తను తెలుగు ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయనకు ఎవరూ సాటి లేరు. అక్షరాలా చిరంజీవి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement