ప్రస్తుత ఏకైక అగ్రరాజ్యమైన అమెరికాతో, ఒకనాడు అగ్రరాజ్యంగా వెలిగిన రష్యాతోనూ, అగ్రరాజ్య హోదా కోసం సర్వశక్తులను ఒడ్డుతున్న చైనాతోనూ మన దేశం సాగిస్తున్నదౌత్యం చాలా సున్నితమైనది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీక్షాదక్షతలకు అగ్నిపరీక్షగా నిలిచిన ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ విజయం సాధించారనే చెప్పాలి. అన్ని వైపులా ఒత్తిడులు వచ్చినా ఎటువైపూ మొగ్గకుండా, తీగ మీద బట్ట లాక్కున్నట్టు సున్నితంగా వ్యవహరించడంలో దౌత్య కౌశలం ప్రస్ఫుటిత మవు తుంది. నిజానికి ఉక్రెయిన్ – రష్యాల మధ్య వివాదం వాటి మధ్య వ్యవహారమే. ఉక్రెయిన్‌లో జరుగుతున్న రక్తపాతాన్నీ, మారణ కాండనూ ఖండించడం తప్ప ఇతర దేశాలు చేయగలిగిందేమీ లేదు. యుద్దాన్ని ఆపమని రష్యాకు ప్రపంచంలోని అన్ని దేశాలూ ఎంతగా నచ్చజెప్పినా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎవరి మాటా వినకుండా దూకుడుగా వ్యవహరించడం వల్ల వారి దేశానికే తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ యుద్ధం వల్ల ఇతర దేశాలు నష్టపోవడం ఏమాత్రం వాంఛనీయమూ కాదు, సమంజసమూ కాదు. రష్యాతో అమెరికాకు దశాబ్దాలుగా వైరం ఉన్నట్టే, రష్యాతో మన దేశానికి మైత్రి ఉంది. మన దేశ అవసరాలకు సరిపడే చమురు నిల్వల్లో అధిక భాగం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. రష్యా నుంచి చమురు కొనవద్దంటూ అమెరికా హెచ్చరించడం ఏ పాటి న్యాయం.? అందుకే అమెరికా అధ్యక్షుడు జోబిడెన్‌తో జరిపిన వర్చువల్ సమావేశంలో మోడీ చాలా స్పష్టంగా మన వైఖరిని వివరించడంతో అగ్రరాజ్యాధినేత దిగిరాక తప్పలేదు. ఉక్రెయిన్ – రష్యాలతో భారత్ సంబంధాల విషయంలో తమదేశం జోక్యం చేసుకోబోదనీ, భారత్ తనకు నచ్చిన నిర్ణయమే తీసుకుంటుందంటూ అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించడం ముమ్మాటికీ మోదీ దౌత్య విజయమే.
అంతేకాదు, భారత్ ఇంతవరకూ తీసుకున్న నిర్ణయాలన్నీ స్వతంత్రమైనవేనని పేర్కొనడం మన దౌత్య విధానానికి ప్రశంసవంటిదే. మోడీ బిడెన్‌తో మాట్లాడటానికి ముందే మన విదేశాంగ మంత్రి జై శంకర్ చాలా సూటిగా, స్పష్టంగా చమురు వాణిజ్యంలో భారత్‌కు ఏ దేశం సూచనలు, సలహాలూ అవసరం లేదనీ, అలాగే, ఎవరి ఒత్తిళ్లకు లొంగ బోదని స్పష్టం చేశారు. అలాగే, రష్యాతో ఆయుధ ఒప్పందాలకు దూరంగా ఉండాలన్న హెచ్చరికకు కానీ, భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి బ్లాక్‌మె యిల్ తరహా ప్రస్తావన గురించి అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకిన్ చేసిన ప్రకటన గురించి స్పందిం చకపోవడం భారత్ ఎంచుకున్న వైఖరికి అద్దం పడుతోంది. అంతేకాదు, రష్యాతో ఆయుధ ఒప్పందాలు చేసుకోరాదని హూంకరించడానికి అమెరికాకు ఏ హక్కు ఉంది. పాకిస్తాన్‌కి ఆయుధాలు సరఫరా చేసిన అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్‌కి ఆయుధాలు సరఫరా చేస్తోంది. అంతర్జాతీయ న్యాయసూత్రాలను పాటించని అమెరికా మనకు సుద్దులు చెప్పడమేమిటి? అందుకే మన దేశం స్పందించలేదు. ఉక్రెయిన్ యుద్ధం విరమణ కోసం భారత్ దౌత్య మార్గాల ద్వారా తీసుకోవల్సిన చర్యలన్నీ తీసుకుంటోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పుతిన్ ముఖాముఖీ చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనవచ్చని అమెరికా అధ్యక్షుడు బిడెన్‌కి మన ప్రధాని తెలిపారు. యుద్ధాన్ని విరమించేందుకు ససేమిరా అంటున్న రష్యా చైనా చెప్పినా వినలేదు. ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించినా చలనం లేదు. భారత్ మాట మాత్రం వింటుందా? అయినప్పటికీ భారత్ తన ప్రయత్నం మానలేదు.అవకాశం వచ్చిన ప్పుడల్లా రష్యాకు సూచిస్తూనే ఉంది.
ప్రజాస్వామ్యంలో పార్టీల మధ్య అయినా, ప్రభుత్వాల మధ్య అయినా వివాదాలు ఏర్పడినప్పుడు దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారాలను కనుగొనాలి. చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్యలేవీ లేవు. ఈ విషయం రష్యా అధ్యక్షునికి తెలియంది కాదు. అహం ప్రకోపించినప్పుడు ఎవరి మాటా వినరు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన దేశ అవసరాలకు సంబంధించిన చమురు, ఆయుధాలను రష్యా నుంచి తెప్పించుకుంటే అమెరికాకు అభ్యంతరం ఎందుకుండాలి? ఈ విషయమై అమెరికా సెనేట్‌లో సభ్యులు కూడా బిడెన్‌ను నిలదీస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ భారత సంతతి వారు కనుక, ఆమె ఇలాంటి సందర్భాల్లో భారత్‌కి అండగా నిలవాలి. అయితే, బిడెన్ వన్నీ సన్నాయి నొక్కులే కానీ, హెచ్చరికలు కావు కనుక పెద్దగా సీరియస్‌గా ఆమె తీసుకోవడం లేదేమో!. మన ప్రభుత్వమే కాదు, మన దేశంలోని వివిధ కంపెనీలు రష్యాతో తెగదెంపులు చేసుకోవడానికి, అక్కడినుంచి తమ సంస్థలను ఉప సంహరించుకోవడానికి సిద్ధపడుతున్నాయి. ఇందు కుఇన్ఫోసిస్ కంపెనీ తీసుకున్న నిర్ణయం నిదర్శనం. రష్యా విషయంలో భారత ప్రభుత్వం కానీ, భారత సంస్థలు కానీ ఏమాత్రం మెతకగా వ్యవహరించడం లేదు. ఇందుకు ఎన్నో ఉదాహరణలు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..