Friday, November 22, 2024

నేటి సంపాదకీయం – ఉద్రిక్తతల వేళ.. ‘రక్షణ’ నిధులకు కోతా..

క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి, భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో కేటాయింపులు జరపడం సర్వసాధారణం. లడఖ్‌ తూర్పు ప్రాంతంలో చైనా సైనికుల దుస్సాహసానికి పాల్పడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గాల్వాన్‌లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించినప్పుడు మన సైనికులు తరిమి కొట్టారు. ఈ నేపథ్యం నుంచి ఆలోచిస్తే రక్షణ రంగానికి మెరుగైన సౌకర్యాలు, సమర్ధవంతమైన ఆయుధాలను సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైనా విసురుతున్న సవాల్‌ను వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆయుధాలు, ఇతర సామగ్రిని మన సైనికులకు సమకూర్చాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్‌ కన్నా ఎక్కువ ఆయుధాలను సమకూర్చుకున్నామనుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో సరిపోదు. గత ఏడాది కోవిడ్‌ కేసుల విజృంభణ వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది. ఈ కారణంగా రక్షణ రంగానికి కేటాయింపుల్లో ఈసారి బడ్జెట్‌లో తగ్గించాల్సి వచ్చింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్వపు స్థితికి త్వరలోనే చేరుకోగలదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కరోనా ముందునాటి 2020 సంవత్సరంతో పోలిస్తే ఈసారి బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయింపులు, గత ఏడాది రక్షణ రంగంలో చేసిన వ్యయం తక్కువేనని చెప్పాలి. 2020 ఆర్థిక సంవత్సరంలో రక్షణ మంత్రిత్వశాఖ వ్యయం జీడీపీలో 2.22 శాతం ఉండగా, ఈ ఏడాది 2.02 శాతం మాత్రమే. కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని 16.7 శాతం నుంచి 13.3 శాతానికి తగ్గించింది.

2010 ఆర్థిక సంవత్సరం నుంచి రక్షణ మంత్రిత్వశాఖ వ్యయం తగ్గుతూ వస్తున్నది. జీడీపీలో మూడు శాతాన్ని రక్షణ రంగానికి కేటాయించాలని పార్లమెంటు స్థాయిసంఘం సిఫార్సు చేసింది. రక్షణ రంగానికి సంబంధించి ప్రభుత్వం ఎంచుకున్న ప్రాథమ్యాల్లో తర్వాత కొట్టొ చ్చిన మార్పు రిటైర్డ్‌ జవాన్లు, అధికారుల పెన్షన్ల విషయంలో. 2020లో పెన్షన్‌ చెల్లింపులు రక్షణమంత్రిత్వ శాఖ మొత్తం వ్యయంలో 26 శాతం ఉండగా, ఈ ఏడాది అవి 22 శాతానికి తగ్గాయి. గత సంవత్సరం పెన్షన్‌ చెల్లింపులతోపాటు కొన్ని పాతబకాయిలను కూడా చెల్లించారు. అంతేకాక, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఒక ర్యాంకు-ఒకే పెన్షన్‌ పథకాన్ని ఐదేళ్ళకోసారి సవరించాల్సి ఉంది. ఆ ప్రతిపాదనను ఆమోదిస్తే పెన్షన్ల కోసం చేసే ఖర్చు పెరగ వచ్చు. రక్షణ రంగం బడ్జెట్‌లో ముఖ్యమైనది సాయుధ దళాలకు వేత నాలు, భత్యాలు చెల్లింపు. రక్షణ శాఖలో పని చేసే సాధారణ ఉద్యోగుల వేతనాలు, భత్యాలను కూడా పెంచాల్సి వచ్చింది.ఈ పద్దు కింద 29.9 శాతం కేటా యింపులు జరిగితే, 2023 బడ్జెట్‌లో 31.1 శాతం కేటాయింపులు జరిగాయి. వెనుకటి సంవత్సరాలతో పోలిస్తే పెన్షన్‌ వ్యయం తగ్గింపుతో ఆయుధాలు, మందుగుండు, ఇతర అవసరాలకు ఎక్కువ నిధులుకేటాయించేందుకు అవకాశం కలిగింది.

2020వ సంవత్సరంలో రక్షణ రంగానికి కేటాయింపులు 24.5 శాతం మాత్రమే ఉండగా, ఈ ఏడాది 29 శాతానికి చేరుకున్నాయి. వీటిలో నౌకాదళం కేటాయింపులను 27 శాతం నుంచి 35 శాతానికి పెంచడం జరిగింది. చైనా నౌకాదళం సముద్ర జలాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో దానిని ఎదుర్కోవడానికి ఎక్కువ నిధులను కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. రక్షణ రంగానికి మూలధనం కేటాయింపులు పెరిగినందున హార్డ్‌వేర్‌ రంగానికి ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. రక్షణ రంగంలో 68 శాతం స్వదేశీ ఉత్పత్తుల నుంచే కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, స్వదేశీ ఉత్పత్తి దారులు తమ ప్రతిభా పాటవాలను చూపడానికి ఇంకా కొంత సమయంపట్టువచ్చు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేసే సంస్థలకు ప్రోత్సహాకాలను అందించాల్సి ఉంది.ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదంతో చేపట్టిన కార్యక్రమాలకు అవసరమైన నిధులు కేటాయించాల్సి ఉంది. ఏటా రక్షణ రంగ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి నిధులుకేటాయించాలన్న డిమాండ్‌ను ఈ సారి బడ్జెట్‌లో పరిగణనలోకి తీసుకోలేదేమోనని పిస్తోంది. రక్షణ రంగానికి కేటాయింపులు జీడీపీలో 2 శాతం చుట్టూనే తిరుగుతున్నాయి. పెరుగుదల ఏమీ కనిపించడం లేదు. చైనా విసురుతున్న సవాల్‌ను ఎదుర్కోవాలంటే మరిన్ని నిధులు కేటాయించకతప్పదు. అందుకు అనుగుణంగా మిలటరీ ప్రణాళికలను రూపొందించుకోవల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement