Friday, November 22, 2024

నేటి సంపాద‌కీయం – దేశ ర‌క్ష‌ణ‌కే పెద్దపీట‌!

ఏ దేశంపైనైనా ముందుగా దాడి చేయడం భారత్‌ విధానం కాకపోయినా, శత్రువు కవ్వించినప్పుడు, కాలు దువ్వినప్పుడు సరైనగుణపాఠం చెప్పే రీతిలో దీటైన సైనిక వ్యవస్థ ఉండాలని మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ ఒక సందర్భంలో అన్నమాటలో నిజమెంతో ఉంది. సైన్యాన్ని అలాగే, ఏ దేశానికైనా సుశిక్షితులైన సైనికులు ఎంత అవసరమో, ప్రతిభావంతులైన యువత అంతే ముఖ్యమని కూడా ఆయన తరచూ అంటూండేవారు. జాతీయవాదం, దేశభక్తి అనే మాటలు రాజకీయనాయకులకే సొంతం కాదనీ, దేశంలోని ప్రతి పౌరుడూ వీటిని అలవర్చుకోవాలన్న కలామ్‌ మాటలు తరచు గుర్తుకు వస్తుంటాయి. రక్షణ వ్యయాన్ని పెంచాల్సిన అవసరం గురించి కూడా కలామ్‌ అప్పట్లోనే సూచించారు. స్వామి వివేకానంద కాలం నుంచి మన దేశం యావత్‌ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడమే కాదు, శాంతి కోసం కృషి చేస్తూనే ఉంది. అయితే, పొరుగుదేశాలు శత్రుదేశాలుగా వ్యవహరిస్తూ మనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు చేతులు ముడుచుకుని కూర్చోవడం భారతీయుల సిద్ధాంతం కాదని స్పష్టం చేయడానికే మన దేశం రక్షణ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. రక్షణ రంగానికి మన దేశం 2021లో 76 బిలియన్‌ డాలర్లను అంటే 6.28 లక్షల కోట్ల రూపాయిలను కేటాయించి ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. అమెరికా రక్షణ వ్యయం 2021లో 801 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. భారత్‌ రక్షణ వ్యయం గడిచిన పదేళ్ళలో 33 శాతం పెరిగింది. స్వీడన్‌కి చెందిన అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. పాకిస్తాన్‌లో కూడా రక్షణ వ్యయం బాగా పెరిగింది. చౖైెనా రక్షణ వ్యయం 2022లో 7.1 శాతాన్ని పెంచింది. అంటే 230 బిలియన్‌ డాలర్లను కేటాయించింది. అమెరికా తర్వాత రక్షణ వ్యయంలో చైనాది రెండో స్థానం. చైనా రక్షణ వ్యయం పెరగడం వల్లనే పొరుగుదేశానికి దీటుగా మన దేశం రక్షణ వ్యయాన్ని ఏటా పెంచుతూ వస్తోంది.

కాగా పాకిస్తాన్‌లో ఆకలి కేకలు ఎక్కువ. అయినా రక్షణ వ్యయంలో తామేమీ తక్కువ కాదన్నట్టు 1.3 ట్రిలియన్‌ డాలర్లను కేటాయించింది. చైనా, రష్యాల ఆయుధ దాహం వల్లనే ప్రపంచంలోని పెక్కు దేశాల రక్షణ బడ్జెట్లు ఏటేటా పెరిగిపోతున్నాయి.
రష్యా రక్షణ వ్యయం పెరుగుదల వల్ల మనకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా, చైనా, పాకిస్తాన్‌లు రెండూ ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతూ భారత్‌కి సవాల్‌ని విసురుతున్నాయి. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం ఇంతవరకూ రెండు లక్షల డాలర్లు పైగా ఖర్చు చేసి నట్టు అంచనా. వేలాది మంది రష్యన్‌ సైనికులు మరణించారు. దేశాల మధ్య అపోహలు పెరగడం వల్లనే రక్షణ వ్యయం ఏటేటాపెరుగుతోంది. ఈ కారణంగా మన దేశం కూడా రక్షణ రంగానికి ఎక్కువ ఖర్చు చేయడం అనివార్యమవుతోంది. మన దేశం రక్షణ రంగానికి చేసే ఖర్చులో అధిక భాగం ఆయుధాలు, సైనిక సామగ్రికే అవుతోంది. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ అధికా రాన్ని చేపట్టిన తర్వాత సైనికుల చిత్తస్థయిర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఆయుధ సంపత్తి విషయంలో పొరుగుదేశాల సవాల్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటూనే సైనికుల సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్‌ పద్దతిని అమలు జేస్తున్నారు. అలాగే, ఎత్తయినపర్వతాల్లో గస్తీ కాసే సైనికులకు చలిని తట్టుకునే ఉన్ని దుస్తులను సరఫరా చేయిస్తున్నారు. దీపావళి పర్వదినంనాడు సియాచిన్‌ తదితర ఎత్తయిన ప్రాంతాల్లో సైనికులతో కలిసి పండుగ జరుపుకుంటున్నారు. అయితే, సైనికులకు సరఫరా చేసే ఆహారం, దుస్తుల విషయంలో నాణ్యత పాటించబడటం లేదన్న ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.

కరోనా వల్ల గడిచిన రెండేళ్ళుగా అన్ని దేశాల ఆర్థికవ్యవస్థలూ పెను సవాళ్ళను ఎదుర్కొన్నాయి. అయినప్పటికీ రక్షణ వ్యయాన్నికొద్దోగొప్పో పెంచుకుంటూనే పోవడం గమనార్హం. రక్షణ సామగ్రి దిగుమతులను తగ్గించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం అమలులోకి వచ్చిన తర్వాత రక్షణోత్పత్తి వ్యయం తగ్గుతున్నట్టు సమాచారం. మన దేశంలో సైనికులు కేవలం దేశ భద్రత కోసమే కాకుండా, దేశంలో ఉప్పెన, తుపాను, వరదలు వంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవించినప్పుడు ప్రాణాలకు తెగించి సేవలందించిన సందర్భాలెన్నో ఉన్నాయి. సైనికులకు అంతటి ప్రాధాన్యం ఉండబట్టే దేశానికి రైతులు ఆహా రాన్ని అందించి అన్నదాతగా పేరుగడించినట్టే, సైనికులు భద్రత ఇచ్చి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని ఐదున్నర దశాబ్దాల క్రితమే వ్యాఖ్యానించడమే కాకుండా, జైజవాన్‌- జై కిసాన్‌ అనే నినాదాన్ని మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఇచ్చారు. అది ఇప్పటికీ నిత్యనూతనం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement